వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గన్నవరం రచ్చ కొలిక్కిరాలేదు. ఇంతలోనే గుంటూరు జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత పోరు కాస్తా న్యాయస్థానాల వరకూ చేరింది. ఇదే విషయాన్ని బయటకు చెబితే చూశారా! ఎల్లోమీడియా అంటూ విమర్శలు. మరి అసలు సంగతి ఏమిటని అడిగితే.. ఆశ..దోశ అప్పడం వడ.. మేం చెప్పమంటూ గీరాలు. రాజకీయాలకు రాజధాని గుంటూరు జిల్లా. అక్కడ ఏ క్షణాన ఎవరెలా స్పందిస్తారనేది అంచనా వేయటం కష్టమే. సొంతగూటిలో నేతలే.. అర్ధరాత్రి జెండామార్చి ఏమార్చగల సమర్థులు. అసలు విషయం ఏమిటంటే… సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబు. ఎన్నో ఏళ్లకు గానీ అధ్యక్షా అనే అవకాశాన్ని దక్కించుకోలేకపోయారు. సర్లే.. దాని కథను కాసేపు పక్కనబెడితే.. ఇప్పుడు సొంతపార్టీ నేతలు హైకోర్టులో ఫిర్యాదు చేయటం.. దానిపై అంబటిపై కేసు నమోదు చేయటం అన్నీ జరిగాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజుపాలెం మండలానికి చెందిన ఇద్దరు వైసీపీ కార్యకర్తలు.. అంబటి అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడంటూ పిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా రాజకీయం అనుకోవటానికి అవకాశం లేదని.. తాము కూడా వైసీపీ కార్యకర్తలమేనంటూ ఫిర్యాదుదారులు శ్రీనివాసరెడ్డి, రామయ్య కోర్టుకు విన్నవించారు.
సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాలు మైనింగ్‌కు కీలకం. అక్కడ పార్టీలకు అతీతంగా సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు చక్రం తిప్పుతుంటారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఇదేం లెక్క.. ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు కావాలంటూ అంబటి వర్గం వాదించింది. దీంతో గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి వర్గానికి ఇబ్బందిగా మారింది. 2019 ఎన్నికల సమయంలోనే అంబటి రాంబాబుకు సత్తెనపల్లి కేటాయించటంపై రెడ్డి సామాజికవర్గ నేతలు వ్యతిరేకత తెలిపారు. రెడ్డి వర్గానికి చెందిన నాయకుడుకి సీటివ్వాలంటూ జగన్ వద్ద పంచాయితీ కూడా పెట్టారు. అయినా అంబటి పంతం నెగ్గించుకుని గెలిచాడు.
ఇప్పుడు అదే వ్యతిరేకవర్గం.. కాసు మహేష్‌రెడ్డి సాయంతో అంబటిపై కేసులు, కోర్టులకు ఫిర్యాదు చేయించారనే గుసగుసలు వైసీపీ శిబిరంలో జోరుగా సాగుతున్నాయి. ఏమైనా.. సత్తెనపల్లి నియోజకవర్గం ఎవరికీ అచ్చొచ్చినట్టు లేదు. 2014-19 వరకూ టీడీపీ ఎమ్మెల్యేగా చేసిన కోడెల శివప్రసాద్.. స్పీకర్‌గా ఎదిగినా.. చివర్లో అవినీతి మచ్చ వేయించుకున్నారు. వారసుల చేష్టలు.. అధికారపార్టీ కేసులతో ఆత్మహత్య చేసుకున్నారు. అంబటి రాంబాబు మాత్రం.. తానేం మైనింగ్‌మాఫియాలో సభ్యుడిని కాదంటున్నారు. ఏ విచారణకైనా సిద్ధమంటూ ప్రకటించారు.