తాడికొండ శాసనసభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. వివాదాలు ఆమె చుట్టూ తిరుగుతాయో.. లేకపోతే వివాదాల చుట్టూ తానే ఉంటారనేది అర్ధంగాకుండా ఉంది. తరచూ ఏదో ఒక చికాకుతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాననే ఆనందాన్ని దూరం చేస్తున్నారు. ఇటు సొంత పార్టీ నేతలు.. అటుప్రతిపక్ష నాయకులు నిత్యం ఏదో విధంగా మహిళా ఎమ్మెల్యేను వివాదాల్లోకి లాగుతూనే ఉన్నారు. ఏపీ రాజధాని అమరావతి గ్రామాలన్నీ దాదాపు తాడికొండ పరిధిలోనివే. అంటే ఓ విధంగా ఆమె రాజధాని ఎమ్మెల్యేగానే చెప్పాలి. అంతటి కీలకమైన ఆమెకు మొదట సొంతవాళ్ల నుంచే ఊహించని షాక్ ఎదురైంది. అదెలా అంటారా.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పర్యటించటం.. పైగా ఇసుక లావాదేవీల్లో ఎమ్మెల్యే అనుచరులను బెదిరించటం వంటివి జరిగాయి. దీనిపై ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య అంతర్వుద్ధం కూడా మొదలైంది. చివరకు పెద్దల జోక్యంతో సద్దుమణిగినా చాపకింద నీరులా ఇప్పటికీ వైరం అలాగే ఉందనే ప్రచారమూ లేకపోలేదు. ఆ తరువాత వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో శ్రీదేవిని కొందరు అనుమతించకపోవటంతో ఆమె అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కొందరు అయినవారే.. ఉండవల్లి శ్రీదేవి అసలు ఎస్సీ కాదంటూ గుంటూరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జాయింట్ కలెక్టర్ స్వయంగా విచారణ చేసేంత వరకూ చేరింది. ఇదిలా ఉంటే.. నగరంపాలెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను దుర్భాషలాడిన తీరు మీడియా ద్వారా బట్టబయలు కావటం సర్కారుకు ఇబ్బందిగా మారింది. ఆ తరువాత ఆమె పక్కన ఉన్న నలుగురు అనుచరులు ఉండవల్లి శ్రీదేవితో తమకు ప్రాణభయం ఉందంటూ ఏకంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డికి సెల్ఫీ వీడియో ద్వారా విజ్క్షప్తి చేశారు. తమకు ఇవ్వాల్సిన కోటిరూపాయలు ఇవ్వట్లేదంటూ ఎమ్మెల్యే పరువును బజార్న పెట్టినంత పనిచేశారు. ఇప్పుడా నలుగురు మరోసారి మీడియా ఎదుట తమకు ఎమ్మెల్యేతో ప్రాణభయం ఉందంటూ రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే శ్రీదేవి తనకు వాళ్ల వల్లనే ప్రాణాపాయం ఉందంటూ గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన సందీప్, సురేష్ ఇద్దరూ తనపై కక్ష తీర్చుకుంటారనే ఆందోళన వ్యక్తంచేశారు. నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి.. ఈ రచ్చ ఎంత వరకూ చేరుతుందనేది ఉత్కంఠతగా మారింది.