2019 మార్చిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి మర్డర్ సంచలనం. ఇదంతా అప్పుడు టీడీపీలో ఉన్న పెద్దలే చేయించారంటూ ఆనాడు ప్రతిపక్షంలో వున్న వైసీపీ అధినేత జగన్ ఆరోపణ. తూచ్.. వైసీపీ నేతలే సానుభూతి కోసం మర్డర్ చేయించారంటూ టీడీపీ ఎదురుదాడి. ఆ తరువాత ఎన్నికల్లో పవర్ చేతులు మారింది. విపక్ష నేత జగన్ సీఎం అయ్యాడు. ఇంకేముంది.. బాబాయి హత్య వెనుక ఉన్న వారు ఎవరైనా జుట్టుపట్టి లాగి జైలు ఊచలు లెక్కబెట్టించటం ఖాయమని ఏపీ జనం అనుకున్నారు. కానీ.. బాబాయి కేసు మినహా.. టీడీపీ నేతలు అచ్చెన్న, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్‌రెడ్డి, దూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్ వంటి వారంతా జైలుకెళ్లొచ్చారు. మరి బాబాయి కేసు ఏమైనట్టు అంటే. అబ్బే అదంగా సీబీఐ చేతుల్లో ఉంది. అంటే.. సీబీఐ కేంద్ర పరిధిలోనిది కాబట్టి వాళ్లే తేల్చాలనేది సర్కారు సమాధానం. రెండేళ్లుగా పడకనబడిన కేసును మళ్లీ తిరగతోడుతున్నారు. అప్పట్లో దర్యాప్తు ముమ్మరం చేసి నేడో రేపో నిందితులు చిక్కుతారనుకునే సమయంలో నిజాయతీకు నిలువుటద్దమైన కుటుంబం నుంచి వచ్చిన ఐపీఎస్ అధికారిని ప్రాధాన్యతలేని పోస్టుకు బదిలీచేశారు. ఇది ఎందుకంటే.. సాధారణ బదిలీల్లో భాగమేనంటూ చేతులు దులుపుకున్నారు. మళ్లీ పది రోజులుగా సీబీఐ బాబాయి మర్డర్ వెనుక వాస్తవాలను కూపీలాగే పనిలో పడింది. దస్తగిరి, శ్రీనివాసరెడ్డి ఇలా దాదాపు 100 మందిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు మరికొన్ని కీలక ఆధారాలు సేకరించారట. ఇంతకీ.. వివేకా మర్డర్ ఎవరు చేశారనేది తేలటం సంగతి ఎలా ఉన్నా.. అబ్బాయి పవర్‌లో ఉన్నపుడే నిందితులు చిక్కుతారా! అనేది ఏపీ ప్రజల బుర్రలను బద్దలు కొడుతున్న ప్రశ్న.