ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ అడ్డా. అక్కడ కలసిమెలిసి తిరిగిన కుటుంబాలు కత్తులు నూరుకుంటాయి. భూమా అఖిలప్రియ రాజకీయ వారసత్వంతో కొద్దికాలంలో మంత్రిగా ఎదిగారు. అదేసమయంలో ఎన్నో ఆరోపణలు కొనితెచ్చుకున్నారు. భర్త భార్గవ్ అన్నీ తానై చక్కబెట్టాడనే అపవాదు లేకపోలేదు. భార్య వెనుక షాడోలుగా పెత్తనం చేసే జాబితాలో అతడూ చేరాడు. తమకు అడ్డొచ్చిన వారిని బెదిరించటం… కొట్టడం.. కేసుల్లో ఇరికించటం అన్నీ చేశారు. కానీ.. ఇప్పుడు విపక్షంలో ఉన్నారు. అందుకే పాత తప్పులన్నీ ఒక్కోకటీ వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనదే టీడీపీ నేత ఏవీసుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసు. దీనివెనుక భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ ప్రమేయం ఉందంటూ కేసు కూడా నమోదుచేశారు. పోలీసులు ఏ1 నుంచొ ఏ6 వరకూ నిందితులను అరెస్ట్ చేశారు. ఏ4 అఖిలను మాత్రం ఎందుకు వదిలేశారంటూ సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇలాగే వదిలేస్తే తన ప్రాణానికి ముప్పు ఉందంటూ కడపజిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను ఏవీసుబ్బారెడ్డి, ఆయన కూతురు జస్వంతి కలసి వినతిపత్రం అందజేశారు. అఖిలప్రియ తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే హత్యారాజకీయాలు చేస్తుందంటూ ఆరోపించారు. ఇప్పటికే మూడు నోటీసులు అఖిలప్రియకు జారీచేశామంటూ పోలీసులు చెబుతున్నారు. నిబంధన ప్రకారం తాము చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టంచేశారు. అసలు అఖిలప్రియను అరెస్ట్ చేయకపోవటానికి అసలు కారణం ఏమై ఉంటుంది. ఏ మాత్రం అవకాశం చిక్కినా టీడీపీ నేతలను వదలని వైసీపీ సర్కార్ అఖిల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తుంది. సమాధానాలు దొరకని ప్రశ్నలకు.. అఖిల ప్రియపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటమే జవాబు అంటున్నారు సామాన్యులు.