యాడిచ్చారు… నిందితుడు యాడున్నాడో!

కొంద‌రు చచ్చి బ‌తికిపోతారు. లేక‌పోతే.. మ‌ళ్లీ మ‌ళ్లీ కుళ్ల‌పొడిచి మ‌రీ చంపేస్తారు. ఇదంతా ఎందుకంటే… దివంగ‌త సీఎం వైఎస్సార్ సోద‌రుడు… ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కి స్వయానా బాబాయి మ‌ర్డ‌ర్ మార్చి 2019లో జ‌రిగింది. అంటే.. ఇప్ప‌టికీ రెండేళ్ల పైమాటే. మొన్నీ మ‌ధ్య భ‌ర్త‌ను చంపిన బార్య సోకాలు పెట్టి ఏడ్చినా.. ఆరాలు తీసి… ప‌క్కా సాక్ష్యాల‌తో మ‌రీ నిందితుల‌ను ప‌ట్టుకున్నారు పోలీసులు. అట్టాంటి టెక్నాల‌జీ, ట్రీట్ మెంట్ వాడే పోలీసుల‌ను మించిన సీబీఐకు ఇప్ప‌టికీ వైఎస్ వివేకా మ‌ర్డ‌ర్ కేసులో నిందితులెవ‌రో తెలియ‌లేదు. అందుకే.. ప‌ట్టిస్తే ప‌దిల‌క్ష‌ల రూపాయల న‌జ‌రానా అంటూ తెలుగు దిన‌ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌టించారు. నిజ‌మే ఏదైనా కేసులో ఆధారాలు దొర‌క్క‌పోతే నిఘా, ద‌ర్యాప్తు సంస్థ‌లు చేసే ప‌నే ఇది. గాక‌పోతే.. ఇన్నేళ్ల త‌రువాత కూడా ప్ర‌క‌ట‌న వ‌ద్ద‌నే ఎంక్వైరీ ఆగిపోవ‌ట‌మే బాధేస్తుంది. సాక్షాత్తూ ఒక రాష్ట్ర సీఎం ర‌క్త‌సంబంధానికే ఇట్టాంటి న్యాయం జ‌రిగితే సామాన్యుల ప‌రిస్థితి ఏమిట‌నే ప్ర‌శ్న కూడా ఎదుర‌వుతుంది.

క‌డ‌ప‌లో ఏదో జ‌రుగుతుంది.. అదే ఏమిట‌నేది మాత్రం స‌స్పెన్స్‌. రాజ‌కీయంగా క‌డ‌ప జిల్లా ఏపీను ప్ర‌భావితం చేస్తుంద‌నేది వైఎస్స్ సీఎం అయిన‌పుడే అర్ధ‌మైంది. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌పుడు కూడా వైఎస్ త‌న‌కంటూ ప్ర‌త్యేక వ‌ర్గాన్ని కాపాడుకుంటూ వ‌చ్చారు. సీఎం అయ్యాక అంద‌ర్నీ గుర్తుపెట్టుకుని ఆర్ధికంగా, రాజ‌కీయంగా ఎదిగేందుకు సాయ‌ప‌డ్డారు. అటువంటి కుటుంబం నుంచి వ‌చ్చిన వైఎస్ వివేకానంద‌రెడ్డికి శ‌త్రువులు ఎవ‌ర‌నేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే. వివేకా అజాత‌శ‌త్రువు అనే పేరుంది. అంద‌రూ ఆయ‌న్ను వైఎస్ సోద‌రుడిగా గౌర‌వించేవారు. అటువంటి నేత హ‌త్య‌కు గురికావ‌టం.. ఇదంతా చాలా పెద్ద త‌ల‌ల ఎత్తుగ‌డ‌గా వాచ్‌మెన్ ఇచ్చిన వాంగ్మూలం.. కోట్లాదిరూపాయ‌ల సుపారీ ఇదంతా వివేకా మ‌ర్డ‌ర్ వెనుక రాజ‌కీయాన్ని మించిన మ‌త‌లబు ఏదో ఉంద‌నేందుకు అవ‌కాశ‌మిస్తుంది. పైగా ఈ కేసులో ద‌ర్యాప్తు చేప‌ట్టిన అధికారులు త‌ర‌చూ బ‌దిలీ కావ‌టం కూడా ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఇటువంటి సంక్లిష్ట‌ ప‌రిస్థితుల్లో ఏకంగా సీబీఐ నిందితుడి గురించి ఆచూకీ కోసం ప్ర‌క‌ట‌న ఇవ్వ‌టం కొస‌మెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here