నూరేళ్ల జీవితానికి ఊపిరిపోసే అమ్మ. మానవ మనుగడకు ఆమె ఆధారం. రేపటి ప్రపంచానికి అమ్మే పట్టుగొమ్మ. పెళ్లయి అత్తింట కాలుపెట్టగానే ఉవ్విళ్లూరేది.. అమ్మతనం రుచిచూడాలని. పుట్టబోయే బిడ్డకోసం ఎన్నో కలలు కంటుంది. తాను కూలీ అయినా బిడ్డను మహరాజుగా మార్చాలనుకుంటుంది. గర్భిణి అని తెలియగానే ఆమె పట్ల మర్యాదలు మారిపోతాయి. నిండుశూలాలను గర్భగుడిలో దైవంతో సమానంగా చూస్తారు. అంతటి కమనీయమైన గర్భధారణ ఇప్పుడు మార్కెట్‌లో వస్తువుగా మారింది. అసలే కరోనా కాలం. ఉద్యోగాలు ఊడాయి. పనులు దొరకటం కష్టంగా మారాయి. మరి ఇప్పుడేం చేయాలి. కొందరు నేరాల బాట పడుతున్నారు. ఆత్మాభిమానం ఉన్నవారు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకొందరు తమ శరీరాన్ని పెట్టుబడిగా మలచుకుంటున్నారు. చాలా కార్పోరేట్ ఆసుపత్రులకు వీరే కావాలి. క్లినికల్ ట్రయల్స్‌కూ కూలీనాలీ చేసుకుంటూ పొట్టపోసుకునే జనమే కావాలి. బాగా డబ్బుచేసి సంతానం లేక బాధపడేవారికీ ఇవే కూలీ బతుకులు కావాలి. అయితే ఇప్పుడు అద్దెకు అమ్మతనం. అంటే.. డబ్బుండి.. అమ్మానాన్న పిలుపునకు దూరమైన దంపతులకు నవమాసాలు మోయకుండా.. పురిటినొప్పులు పడకుండా సంతానం పొందే ఏకైక మార్గం సరోగసీ. సంతాన సాఫల్యకేంద్రాలుగా పైకి బోర్డులు వేలాడుదీస్తూ కనిపించే చాలా ఆసుపత్రుల్లో చీకటి కోణం ఇదే. డబ్బు అవసరమైన ఆరోగ్యవంతమైన యువతులు, మహిళలను గుర్తించటం.. వారికి వలవేసి డబ్బు ఆశచూపటం.. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లో ఇదో బడా వ్యాపారం. సృష్టి సంతాన సాఫల్యత పేరిట వెలసిన ఆసుపత్రిలో డాక్టర్ నమ్రత దాదాపు 64 మందికి పురుడు పోసిందట. ఇప్పుడా పిల్లలు ఎక్కడున్నారు. అసలు ఇక్కడే ఉన్నారా! ఎవరికైనా అమ్మారా! అనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కానీ ఎన్నో వెలుగుచూడని ఇటువంటి దారుణాలకు కరోనా కలిసొచ్చింది. ఉద్యోగాలు.. ఉపాధి మార్గాలు కోల్పోయిన చాలామంది మహిళలు.. తమ గర్బాన్ని అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. దీన్ని చాలా కార్పోరేట్ ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయట. దీనిపై రెండు తెలుగు రాష్ట్ర పోలీసు, వైద్య యంత్రాంగం దాడులకు సిద్ధమవుతోందని సమాచారం.



