నవ్వుతూ.. ఆప్యాయతను కురిపిస్తూ ఓ మానవమృగం దారుణానికి తెగబడింది. ఏమీ తెలియని ఒక చిన్నారిపై విషపుచూపు చూసింది. అదను చూసి మృగంలా చిన్నారిపై దాడిచేసింది. తనకు ఏం జరుగుతుందనే తెలిసేలోగా ఆ పాప తీవ్ర అనారోగ్యానికి గురైంది. తన అనుకునేవారు ఎవ్వరూ లేని ఆ బాలిక.. మూడ్రోజులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి.. మానవమృగాల మధ్య బతకటం కంటే చావే మేలని పైలోకాలకు వెళ్లిపోయింది. సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ గ్రామం. అక్కడ ఐదంతస్తుల భవనంలో మారుతి అనే అనాథాశ్రమం ఉంది. దాదాపు 50 మంది బాలికలు అక్కడ రక్షణ పొందుతున్నారు. తెలిసీ తెలియని వయసులో ఉన్న చిన్నారులపై కన్నేసిన వేణుగోపాల్‌రెడ్డి అనే మృగం.. తన కోరికలు తీర్చుకునేందుకు ఆ చిట్టితల్లులను ఆటవస్తువుగా ఉపయోగించుకున్నాడు. అక్కడ 12-13 ఏళ్ల బాలికపై ఏడాదికాలంగా లైంగికదాడి చేస్తన్నాడు. అమ్మానాన్న ఏనాడో మరణిస్తే.. బంధువులు ఆ బాలిక భారం మోయలేక.. అనాథశ్రమంలో చేర్చారు. ఆ చిన్నారిని ఏం చేసినా ఎవ్వరూ నోరు మెదపరనే భరోసాతో ఆనాథశ్రమం ఆర్గనైజర్లు ఆ కామాంధుడికి సహకరించారు. ఏడాదికాలంగా దారుణానికి తోడ్పాటును అందించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి22న బాలికను హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి పంపారు. అక్కడ ఆ బాలికను పట్టించుకోలేదు. అప్పటి వరకూ జరిగిన లైంగికదాడితో శారీరకంగా నీరసించింది. మలమూత్రాలపై అదుపు కోల్పోయింది. దానికి తగినట్టుగా బలహీనత. తరచూ ఇలా మూత్రం పోసుకోవటంతో బందువులు ఆ చిన్నారిని తీవ్రంగా కొట్టారు. కనీసం దీనికి కారణం ఏమిటనే ఆరా తీసేందుకు ప్రయత్నం చేయలేదు. జబ్బుతో ఉందనే కనికరం చూపలేకపోయారు.
ఫలితంగా తీవ్ర అనారోగ్యానికి గురైన బాలికను పిన్ని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యుడు కూడా నా వల్ల కాదంటూ చేతులెత్తేశాడు. పోలీసుల వద్దకో.. ప్రభుత్వ ఆసుపత్రికో వెళ్లమని సూచించాడు. చిన్నారిపై లైంగికదాడి జరిగినట్టు చెప్పాడు. ఇది జులై చివర్లో జరిగింది. ఆ తరువాత పోలీసులు, కేసులు అన్నీ జరిగాయి. వారం రోజుల పాటు బాలికను సంరక్షణ కేంద్రంలో ఉంచారు. కానీ.. అప్పటికే అనారోగ్యం, సరైన ఆహారం లేకపోవటం వల్ల నీరసించిన ఆ పుత్తడిబొమ్మ గురించి ఆలోచించలేదు. ఒకరోజు.. ఆ బాలిక కళ్లుతిరిగి పడిపోతే అప్పుడు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. శరీరం మొత్తం పుండుగా మారిన చిన్నారి కోమాలోకి చేరింది. రెండ్రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది. చనిపోయింది. ఇంత దారుణానికి
కారకుడు వేణుగోపాల్‌రెడ్డిని కాపాడేందుకు పెద్దలు రంగంలోకి దిగారు. పేదింట పుట్టిన అనాథబాలిక చుట్టూ జరిగిన నిర్లక్ష్యాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దారుణం విన్నపుడు.. మానవత్వమే కాదు.. మనిసన్నవాడే కనుమరుగుతున్నాడనే భయం పట్టుకుంది.