అమ్మా.. నాన్న‌.. పిల్ల‌ల ఆన్‌లైన్ క్లాసులు!

పిల్ల‌లు గంటసేపు ఇంట్లో ఉంటే కిష్కింద‌కాండ. అదే రోజులు.. నెల‌ల త‌ర‌బ‌డి ఇంటికే ప‌రిమిత‌మైతే.. అబ్బో భ‌రించ‌టం చాలా క‌ష్ట‌మే. ప‌సిపిల్ల‌లున్న ఇంట ప‌రిస్థితి మ‌రీ దారుణం. బ‌య‌ట‌కు తీసుకెళ్ల‌లేక‌.. ఇంట్లో వారిగోల భ‌రించ‌లేక బీపీలు తెచ్చుకునే త‌ల్లిదండ్రులు ఎంతోమంది ఉండే ఉంటారు. ఈ ఏడాది జీరో విద్యాసంవ‌త్స‌రం చేయాలంటూ చ‌దువుకుంటున్న పిల్ల‌లున్న ఇంటి నుంచి వినిపిస్తున్న మరో వాద‌న‌.

కోవిడ్ 19 కు ప్రభావితమైన ప్ర‌ధాన రంగాల్లో విద్యారంగం ఒకటి. 2019-20 విద్యా సంవత్సరం కొంతవరకు దెబ్బతిన్నది. కానీ 2020-21 విద్యా సంవత్సరం పూర్తిగా నష్టపోయింది. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నర్థకంగా మారింది. అటు తల్లి దండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వం విద్యా సంస్థలు పునఃప్రారంభ విషయమై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. అసలు ప్రారంభమవుతాయా ! లేదా ! అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఆన్లైన్ బోధన మొదలుపెట్టారు. ఈ బోధనకు ప్రభుత్వ అనుమతి లేకుండా, విద్యార్థుల తల్లిదండ్రులనుండి ఫీజులు పిండుకోవడానికి ఇదొక కొత్త సాధనంగా యాజమాన్యాల చేస్తున్నాయంటూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల ధ‌ర్నాలు, నిర‌సన‌లు క‌ళ్లెదుట క‌నిపిస్తూనే ఉన్నాయి.

నర్సరీ నుండి 10 వ తరగతి వరకు బోధన బుక్ మెథడ్ ద్వారా జరుగుతుంది. ఇంటర్మీడియట్ నుండి పై చదువులన్ని లెక్చర్ మెథడ్ ద్వారా జరుగుతుంది. 10 వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనకు అన్ని రకాల సెలవులు మినహాయిస్తే రమారమి 190 నుండి 220 పనిదినాలు అవసరం. ఆన్‌లైన్ క్లాసుల వల్ల ఇన్ని పనిదినాలు అందుబాటులో ఉంటాయా?

పాఠశాల విద్యలో, విద్యార్థి ఉపాధ్యాయుడు భౌతికంగా ప్రత్యక్ష బోధన అత్యంత సమర్ధవంతంగా ఉంటుంది. ఇది ఆన్లైన్ విధానంలో సాధ్యపడదు. విద్యార్థి అభ్యాసన స్థాయి, సబ్జెక్ట్ ఎంతవరకు అర్ధమయింది అనేది ఎస్సైన్మెంట్లు, నిఖషలు, త్రైమాసిక , అర్ధ సంవత్సర వార్షిక పరీక్షలు ద్వారా మదింపు చేయడం విదితమే… ఆన్లైన్ విధానం ఎంతవరకు సత్ఫాలితాలను ఇవ్వగలదు?

పాఠశాల జరిగేటప్పుడు 5 నుండి 10 శాతం పిల్లల గైర్హాజరు ఉంటుంది.. మరి ఆన్లైన్ విధానంలో ఎంతమంది విద్యార్థులు మీటింగ్ లో చేరి పాఠాలు వింటారు? వివిధ సామాజిక, ఆర్ధిక స్తోమత గల వర్గాల పిల్లలు పాఠశాలల్లో చదువుతుంటారు.. ఆన్లైన్ లో పాఠాలు వినాలంటే ఎంతమంది తల్లి దండ్రులకు ఆండ్రాయిడ్ ఫోన్ కొని పిల్లలకు ఇవ్వగలరు..కొన్ని గ్రామాల్లో వీడియో వచ్చేంత ఇంటర్నెట్ అవకాశం ఉందా?

పాఠశాల స్థాయిలో విద్యార్థులు అనేక నైపుణ్యాలు నేర్చుకోవలిసి ఉంటుంది. భాషా పరంగా LSRW నైపుణ్యాల్లో చదవడం, రాయడం నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఆన్లైన్ విధానంలో కుదరని పని. విద్యార్థులకు ఇచ్చే ఇంటిపని అంటే హోమ్ వర్క్ పరిశీలించి తప్పులు సరిదిద్దడం సాధ్యం కాదు. ప్రత్యక్షబోధనా పద్ధతిలోనే ఇది సాధ్యం.

కళాశాల స్థాయి అంటే డిగ్రీ, విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ఆన్లైన్ విధానం కొంత వరకు సాధ్యం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇది సాధ్యం కాదు…భౌతిక మానసిక పరివర్తన జరిగే వయసు లో ఇంటర్ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తారు. ఆన్‌లైన్ విధానంతో పూర్తిగా పక్కదారి పట్టే ప్రమాదం లేకపోలేదు.

ఆన్లైన్ తరగతుల పేరుతో విద్యార్థులు సెల్ ఫోన్ లో వచ్చే పబ్జీ లాంటి ఆటలకు బానిసయ్యే ప్రమాదం ఉంద‌నేది సైకాల‌జిస్టుల హెచ్చ‌రిక‌. రైతులు, రోజుకూలీలు, దంపతులిద్దరూ ఉద్యోగులయిన వారు విద్యార్థులను ఏకాంతంగా వదిలి వెళ్ళక తప్పదు.. ఇదే అదునుగా సామాజిక మాద్యమాల్లో విద్యార్థులకు వారికి అవసరమైన వాటిని ఎర వేసి అసాంఘిక కార్యకలాపాల్లో కి ఆకర్షించవచ్చు…

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానాలు, ప్రభుత్వం సరైనా రీతిలో స్పందించి, దురుద్దేశంతో జరుగుతున్న ఆన్లైన్ బోధనను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది..తల్లిదండ్రులు కూడా విచక్షణతో ఆలోచించాలి. వారిపై ఓ క‌న్నేసి ఉంచాలి. త‌ప్ప‌ట‌డుగులు వేయ‌కుండా చూడాలి. పిల్ల‌లు మ‌న‌సారా త‌మ ఇబ్బందులు.. తప్పొప్పులు పంచుకునే స్వేచ్ఛ‌నివ్వాలి. ఏదైనా త‌ప్పు చేసిన‌పుడు.. పొర‌పాటు జ‌రిగిన‌పుడు.. అమ్మానాన్న ఉన్నార‌నే న‌మ్మ‌కాన్ని బిడ్డ‌ల్లో క‌లిగించాలి.

10 COMMENTS

  1. మీరు విశ్లేషించి నట్టు ఇంటర్ వరకు ఆన్లైన్ క్లాస్సెస్ నడపడం కష్టమే ుునివర్సిటీ స్థాయిలో నడపవచ్చు, అలాగే పిల్లలు గేమ్స్ అలవాటు పాడే అవకాశం ఎక్కవ.
    👌 గుడ్ విశ్లేషణ థాంక్ యు సార్👌

  2. 100%నిజం సర్ online క్లాసులు అనేవి ఒక విధంగా పేద
    విద్యార్థుల కు పెద్ద భారం కూడా

  3. పేద, మధ్య తరగతి కుటుంబాల కు ఆర్థిక భారం విద్యార్థుల పై ఒత్తిడి లేకుండ సరైన ప్రణాళిక తో నియమ నిబంధనలు రూపొందించి
    ప్రభుత్యం ఖచ్చితంగా అమలుచేయాలి

  4. ఆన్ లైన్ క్లాసులు పేద తరగతి విద్యార్ధులకు తీరని లోటుగా నా అభిప్రాయం. మొన్నటి వరకు కూడా ఉచిత పుస్తకాలు ప్రభుత్వం ఇచ్చింది. వాటిని ఎంత మంది సద్వినియోగం చేసుకొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఉచిత స్మార్ట్ ఫోన్ ఇచ్చినా, దానికి ఆయ్యే కరుచు పేద విద్యార్థి కి పెనుభారం నా అభిప్రాయం.

  5. విశ్వేశ్వర రావు గారు కదలిక.ఇన్ లో మీ విశ్లేషణ వాస్తవానికి అద్దం పట్టినట్లు ఉన్నాయి. బావున్నాయి మరిన్ని విశ్లేషణ ల కోసం ఎదురుచూస్తాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here