బెజవాడ నడిబొడ్డున జరిగిన దారుణం. కరోనా మహమ్మారితో ఆసుపత్రిలోకి చేరిన వారిని నిర్లక్ష్యం ప్రాణాలు తీసింది. రమేష్ ఆసుపత్రికి అనుసంధానంగా స్వర్ణప్యాలెస్‌లో కొవిడ్19 క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతవరకూ బాగానే ఉంది. అందరూ మనోళ్లే కదా! నిబంధనలు మనకెందుకులే అని భావించి రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది. ఆసుపత్రిలో రోగులు నిండటంతో స్టార్ హాటల్‌ను ఆసుపత్రిగా మార్చేసింది. పైగా ప్రభుత్వ అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇంతకు తెగబడింది. గుండె జబ్బుల స్పెషలిస్టుగా పేరున్న రమేష్ ఆసుపత్రి ఇంతగా బరితెగించటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కరోనా వైరస్ ను బూచిగా చూపుతూ రోగుల నుంచి లక్షలు లక్షలు పిండుకుంటున్న కార్పోరేట్ ఆసుపత్రుల లీలలు విజయవాడకూ పాకాయి. ఇది మనం చెబుతున్న మాట కాదు.. ఏపీ మంత్రులు సుచరిత, ఆళ్ల నాని స్వయంగా అంగీకరించారు. ఆసుపత్రి యాజమాన్యం వాస్తవాలను దాచేసినట్టు చెప్పారు. ఇప్పటికే 11 మంది మరణించారని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే ఏపీ సర్కార్ ఒక్కొకరికి రూ.50లక్షలు ప్రకటించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనకు కారకులపట్ల చాలా సీరియస్‌గానే ఉంది. 48 గంటల్లో వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రులు. ఇదే సమయంలో ఆసుపత్రి నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారం వ్యవహరించిందని కూడా తేల్చిచెప్పారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవటం మామూలుగానే మారిందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
కానీ.. ప్రభుత్వంతో సాన్నిహిత్యం.. ఎంతో అవినావభావ సంబంధం ఉన్న ఇటువంటి కార్పోరేట్ శక్తులను ఇటువంటి విచారణలు, దర్యాప్తులు ఏం చేయగలవనేది? సామాన్యుల నుంచి వచ్చే ప్రశ్న. సాధారణ వ్యక్తి చిన్నపొరపాటు చేసినా.. చివరకు సోషల్ మీడియాలో తెలిసీ తెలియక కామెంట్ పెట్టినా తీసుకెళ్లి లాకప్‌లో వేసి కుళ్లబోడిచే వ్యవస్థలు.. 11 మంది చావుకు కారణమైన నిందితులను పట్టి చట్టం ముందు దోషులుగా నిరూపించగలరా! అనేది మానవహక్కుల సంఘాలు ప్రశ్న. ఏమైనా.. విజయవాడలో జరిగిన ఘోరం వెనుక ఎవరున్నా.. ఎంతటి పెద్ద తలకాయలున్నా.. ఎటువంటి పైరవీలకు తలొగ్గకుండా నిందితులను బోనులో నిలిపినపుడు మాత్రమే ఏపీ సర్కారుకు నిజమైన గుర్తింపు.. మరణించిన వారి ఆత్మకు నిజమైన శాంతి అంటున్నారు మానవతావాదులు.