కొందరంతే. పాపులారిటీ కోసం ఎంతకైనా బరితెగిస్తారు. అవసరమైతే ఇంకెంతకైనా దిగజారేందుకు సిద్ధమవుతారు. ఇటువంటి ఆవారా గాళ్ల కోసం మైక్‌లు పట్టుకుని ముందు నిలబడే యూట్యూబ్ ఛానళ్లు చాలానే ఉన్నాయి. పైగా అందమైన అమ్మాయిలను యాంకర్‌లుగా దింపుతారు. ఇంకేముంది.. తప్పొప్పుల విచక్షణ మరచిపోయి రెచ్చిపోతారు. ఇదే జాబితాలోని ఓ ప్రబుద్ధుడి పేరు సునిశిత్. శాక్రిఫైజ్ స్టార్ అనే ట్యాగ్‌లైన్ తగిలించుకుని మరీ ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. కొన్ని వెబ్ సైట్లు కూడా ఇతగాడి నోటిదూలను అందంగా పేర్చుతుంటాయి. ఇంతకీ.. ఇతగాడు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్. అప్పట్లో ఖైదీ నుంచి నిన్న మొన్నటి పైసావసూల్ వరకూ అన్ని సినిమాల్లోనూ ఇతడినే హీరో అనుకున్నారట. కానీ.. చివర్లో మెగాస్టార్, బాలయ్య, వెంకటేష్ వంటి స్టార్లు వచ్చి అవకాశాలను తన్నుకుపోయారంటూ ఏవో కూతపెడుతుంటాడీ సునిశిత్. లావణ్యత్రిపాఠితో డేటింగ్ అంటూ సంచలనం రేకెత్తించాడు. అమలాపాల్, తమన్నా.. ఇలా చాంతాండత మంది హీరోయిన్లతో తనకు మంచి అనుబంధం ఉందంటూ యూట్యూబ్ ఛానళ్ల ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పాడు. దీనిపై స్వయంగా నటి లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇతగాడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పల్లెల్లో ఇష్టానుసారం తిరిగే ఆకతాయిలను అచ్చోసిన అంబోతులా తిరుగుతున్నాడనేవారు. ఇప్పుడు కేవలం సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని చెలరేగుతున్న సునిశిత్ వంటి మానసిక దౌర్బాగ్యులకు చట్టపరంగా కఠినమైన శిక్షలు పడితే.. ఇటువంటి ఎంతోమంది మృగాళ్ల బుద్దయినా మారుతుందంటున్నాయి మహిళాసంఘాలు.