అల్లారు ముద్దుగా చూసుకున్న కూతురికి పెళ్లిచేసి పంపాడు. ఇద్దరు పిల్లలతో హాయిగా కాపురం చేసుకుంటుంటే పొంగిపోయాడు. ప్రాణంగా భావించే బిడ్డ అకస్మాత్తుగా మరణిస్తే విధిని తిట్టుకుంటూ.. మనుమరాళ్లను ఇంటికి తెచ్చుకున్నాడు. ఇదంతా తూర్పుగోదావరిజిల్లా రౌతులపూడి మండలం డీజేపురం నివాసం సత్యనారాయణ కథ. అక్కడితో ఆగి ఉంటే.. ఇప్పుడీ ప్రస్తావన ఉండేది కాదు. అక్కడే కథ మొదటికొచ్చింది. సత్యనారాయణ వద్దనే మనుమరాళ్లు ఉంటున్నారు. అల్లుడు కూడా అపుడపుడూ కూతుళ్లను చూసుకోవటానికి వస్తుండేవాడు. ఎప్పటి మాదిరిగానే ఈ రోజూ అల్లుడు వచ్చాడు. ఇద్దరూ కలసి మద్యం సేవించారు. కిక్ తలకెక్కిన అల్లుడు నోరుజారాడు. భార్యను తానే హత్య చేశానంటూ మత్తులో అసలు విషయం బయటపెట్టాడు. అసలే కూతురు మరణించిందనే బాధ.. ఆపై మనుమరాళ్లు తల్లిలేని పిల్లలయ్యారనే మనోవేదనతో ఉన్న సత్యనారాయణ ఘోరాన్ని తట్టుకోలేకపోయాడు. కూతుర్ని చంపానంటూ నోరు జారగానే.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కత్తితో వెంటపడ్డాడు. అల్లుడి తల తెగనరికి.. మొండెం అక్కడే వదిలేశాడు. తలను తీసుకుని మనుమరాళ్లతో కలసి పోలీస్‌స్టేషన్‌కు చేరాడు.