నిత్యానందుడు.. నిత్యం ఏదోఒక వివాదాల్లో వినిపించే ఆధ్యాత్మిక గురువు. అపుడెపుడో ఒక సినీనటితో అసభ్యంగా ఉన్న వీడియోతో ఫుల్‌పాపులారిటీ సంపాదించారు. ఇదంతా సేవలో భాగమంటూ మరికొంత ఆజ్యం పోశాడు. ఈయన గారి లీలలు అన్నీ ఇన్నీ కాదు. లైంగికవేధింపులపై పలువురు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. 42 ఏళ్ల నిత్యానంద.. బాల్యం నుంచి ఇదే బాటలో ఉన్నాడు. వయసుతోపాటు యాగాలు.. ప్రసంగాలతో పాపులారిటీ సంపాదించారు. విదేశీ భక్తులు లక్షల్లో ఈయన వద్దకు వస్తారు. ఆయన మాటలు కూడా చాలా వింతగా ఉంటాయి. ఇంగ్లిషు ఉచ్ఛారణతో ఆయన మాట్లాడే తీరు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్. ఒకరోజు పులిచర్మంపై కూర్చుంటారు. మరోసారి ఏనుగు అంబారీపై ఊరేగుతారు. తానే శివుడిని అంటారు. ముక్తిని ప్రసాధిస్తానంటారు.. ఇన్ని వివాదాలతో పోలీసులు వెతుకులాటతో తూచ్ అంటూ.. మూటా ముల్లె సర్దుకుని మందీమార్బలంలో ఎటో వెళ్లిపోయారు. చివరకు ఈక్వెడార్‌లో సముద్రం మధ్య ఒక దీవిని కొనుగోలు చేసి కైలాసదేశం అనే నామకరణం చేశారు. ఇప్పుడు అక్కడ ఏకంగా కైలాస రిజర్వ్‌బ్యాంకును ఏర్పాటుచేసినట్టుగా ప్రకటించి సంచలనం రేకెత్తిస్తున్నారు. తమ దేశ కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా చెలామణీ అయ్యేలా దేశాలతో మాట్లాడటం. ఒప్పందాలు కుదుర్చుకోవటం కూడా జరిగాయట. మరో విశేషమేమిటంటే.. తాను కొనుగోలు చేసిన దీవిలో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు.. పాలన కూడా మొదలుపెట్టారట. అయితే.. దీన్ని ఈక్వెడార్ ప్రభుత్వం మాత్రం కొట్టిపారేయటం గమనార్హం. అయితే.. కైలాసదేశపు కరెన్సీ 22న వినాయచవితి శుభవేళ విడుదల చేసేందుకు నిత్యానందుడు సన్నాహాలు కూడా చేస్తున్నారట.