యూపీలో ఇదొక సంచలనం. అదీ యోగి ఆధిత్యనాథ్ సర్కారులో ఇంతటి దారుణం. పోలీసులకు సవాల్. ఉత్తరప్రదేశ్ అంటేనే క్రిమినల్స్ ఫ్యాక్టరీ. రాజకీయపార్టీలు కూడా తమ ప్రాభల్యం పెంచుకునేందుకు పోషించిన గూండాగిరి. సామాన్యుల ధన, మాన ప్రాణాలకు విలువనివ్వని ప్రభుత్వాల తప్పులు. కానీ.. యోగి సీఎం అయ్యాక అక్కడ పరిస్థితి మారింది. క్రిమినల్ గ్యాంగ్‌లకు అడ్డాగా మారిన కాన్పూర్‌లోనూ రౌడీగ్యాంగ్‌లు తగ్గాయి. కానీ.. పోలీసుశాఖలో ఉండే కొందరు అవినీతి పరుల అండతో నిర్భయంగా నేరాలను కొనసాగిస్తున్న గ్యాంగ్‌స్టర్స్‌లో వికాస్‌దూబే ఒకడు. రాష్ట్ర రాజధాని లక్నోకు 150 కిలోమీటర్ల దూరంలోని బిక్రూ గ్రామంలో
పాగా వేశాడు. పల్లె ప్రజలను బెదిరించి ఊరి మధ్య క్రిమినల్ డెన్‌ను నిర్మించాడు. 1993లో హత్యకేసులో అరెస్టయి క్రిమినల్ రికార్డుల్లోకి చేరిన వికాస్ 100కు పైగా నేరాల్లో మోస్ట్ వాంటెండ్ నేరగాడు. 11 హత్యల్లో ప్రమేయం ఉంది. 2001లో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బీజేపీ మంత్రిని అక్కడే కాల్చిచంపాడు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను చేరదీసి నేరాల్లో శిక్షణ ఇచ్చేవాడు. వారికి ఆయుధాలిచ్చి యదేచ్ఛగా నేరాలు కొనసాగించాడు. మూడ్రోజుల క్రితం ఓ హత్యకేసులో ఇతడిని అరెస్ట్ చేసేందుకు సుమారు 20 మంది పోలీసులు బయల్దేరారు. ఈ సమాచారాన్ని ముందుగానే పసిగట్టిన వికాస్ పక్కా స్కెచ్ వేశాడు. పోలీసులను తప్పుదారి పట్టించాడు. ముందుగానే గ్రామసరిహద్దుల్లో అడ్డంకులు ఏర్పాటు చేశాడు. బుల్డోజర్ సాయంతో వాటిని తొలగించిన పోలీసులు అతడి ఇంటి వద్దకు చేరగానే.. అప్పటికే డాబాలపై మాటువేసిన రౌడీగ్యాంగ్ పోలీసులకు ఏకే47, రైఫిల్స్‌తో బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు తప్పించుకునేందుకు సమీపంలోని ఇంట్లోకి దూరారు. అక్కడ ఉన్న రౌడీలు.. నలుగురు పోలీసులను గొడ్డళ్లలో నరికి తుపాకీలతో కాల్చి చంపారు. దాదాపు గంటన్నరపాటు సాగిన మారణకాండలో 8 మంది పోలీసులు మరణించారు. యోగీ సీఎం అయ్యాక.. రౌడీలకు బెయిళ్లు దూరమయ్యాయి. దారికి రానివారికి బుల్లెట్లు రుచిచూపుతున్నారు. ఇప్పటికే దాదాపు 1000 మంది క్రిమినల్స్ ఎన్‌కౌంటర్‌తో హతమయ్యారని అంచనా. కానీ వికాస్‌దూబే వంటి వాడిని పెంచిపోషించిన నాటి మాయావతి సర్కారు ఇప్పటికీ అతడిని కాపాడుతూనే ఉంటుందట. ఇతడి భార్య లోకల్ పాలిటిక్స్‌లో కీలకంగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం ఇతడి వయసు 43 సంవత్సరాలు. నూనూగు మీసాల వయసులోనే నేరాలకు దిగిన ఇతడు ఏకంగా ప్రయివేటు సైన్యాన్ని ఏర్పాటు చేసేంతగా ఎదిగాడు. హత్యలు, కిడ్నాప్‌లు, కబ్జాలు యధేచ్చగా సాగించాడు. తాను ఎక్కడకు వెళ్లినా పక్కనే ఇద్దరు లాయర్లు ఉండేవారట.
ఎంత పెద్ద కేసునమోదుచేసినా వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చేవాడు. మాయావతి సీఎంగా ఉన్నపుడు జైలు నుంచే సెటిల్‌మెంట్లు చేశాడనే ఆరోపణలున్నాయి. పోలీసులు తనను ఏం చేయలేరనే ధీమా.. పోలీసుల్లో ఉన్న తన ఏజెంట్ల ద్వారా తన డెన్ వద్దకే పోలీసులను రప్పించుకుని హతమార్చాడు. యోగీ సంధించిన ఎన్‌కౌంటర్ అస్త్రానికి సవాల్ విసిరాడు.మూడ్రోజలుగా తప్పించుకు తిరుగుతున్న వికాస్‌దూబే తలపై ఏకంగా రూ,50000 బహుమతి ప్రకటించారు. కాల్పుల్లో మరణించిన పోలీసుల కుటుంబాలు ఒక్కొకరికి యోగీ ప్రభుత్వం రూ.కోటి ప్రకటించింది. కానీ.. అక్కడి ప్రజలు.. పోలీసు కుటుంబాలుమాత్రం గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటరే అసలు సిసలైన సమాధానంగా భావిస్తున్నారు. రౌడీల చేతిలో మరణించిన పోలీసులకు నివాళి కూడా అదేనంటున్నారు. ఇంతటి నేరచరిత్ర ఉన్న వికాస్ తన గురించి పత్రికల్లో వచ్చిన కథనాలను ఎంచక్కా కత్తిరించి భద్రపరచుకునేవాడట. కొన్నిసార్లు వార్తల్లోకి ఎక్కడం కోసం కొన్ని నేరాలు చేసేవాడనే ప్రచారం సాగుతోంది.



