ఏ మాటికి ఆ మాటే చెప్పుకోవాలంటే… ఇద్దరు చంద్రుల రాజకీయమే వేరు. సిద్ధాంత రీత్యా ఇద్దరి మధ్య బేధాలున్నా వ్యూహ ప్రతివ్యూహాల్లో దిట్టలు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబునాయుడు.. ఒకరు శిష్యుడు. మరొకరు గురువు. ఒకరు రాజకీయంగా తలపండితే.. మరొకరు ఉద్యమంతో రాటుదేలారు. జాతీయ రాజకీయాల్లోనూ ఒక వెలుగు వెలిగిన చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మారారు. బాబు సమర్థతపై ఎటువంటి అనుమానాలు లేకపోయినా.. 2014-19 సమయంలో చేసిన కొన్ని పొరపాట్లు.. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని కోల్పోవటం.. పార్టీలో అవినీతి పెరగటం.. కుల వివక్ష ముద్రతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందంటారు విశ్లేషకులు.
కేసీఆర్ మాత్రం ముందుగానే పెల్లుబుకే వ్యతిరేకతను గుర్తించి ముందస్తు ఎన్నికలతో బయటపడ్డారు. విపక్షాలకు ప్రచార అవకాశం.. విమర్శలకు మార్గం లేకుండా గెలుపుగుర్రం ఎక్కారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వలోపం, గ్రూపు తగాదాలు… అన్నింటినీ మించి తెలుగుదేశం పార్టీతో పొత్తు తెలంగాణలో హస్తం కోలుకోలేని దెబ్బతినేలా చేసింది. కేసీఆర్ వ్యూహానికి ప్రత్యర్థుల తప్పిదాలు కూడా కలిసొచ్చాయి. అదే ఊపుతో జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ కూటమి ఏర్పాటు చేయాలనే కేసీఆర్ దూకుడుకు.. నరేంద్రమోదీ హవా కళ్లెం వేసింది. దీంతో ఆయన రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. ఇప్పుడు టీఆర్ ఎస్‌కు బలమైన పునాది పడటంతో.. మరోసారి ఢిల్లీ రాజకీయంపై కేసీఆర్ గురిపెట్టారు. దేశవ్యాప్తంగా వున్న ప్రాంతీయపార్టీలు, బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకుని జట్టుకట్టాలని కేసీఆర్ ఎత్తుగడ. దీనిపై ఇప్పటికే పలువురు సీనియర్ రాజకీయవేత్తలు, ప్రాంతీయ పార్టీలతోనూ చర్చలు జరిపారట.
చంద్రబాబు.. హైదరాబాద్‌లో ఉంటూనే కేంద్రానికి ఫిర్యాదులు.. వైసీపీ సర్కారుపై న్యాయస్థానాల్లో కేసులతో జనంలో ఉన్నట్టుగానే టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీలో జగన్ పాలనపై భిన్న స్పందనలు రావటంతోపాటు.. చంద్రబాబుపై కొంత సానుభూతి పవనాలు వీస్తున్నట్టుగా టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. వరుసగా వైసీపీ సర్కార్‌కు న్యాయస్థానాల్లో ఎదురవుతున్న మొట్టికాయలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలు ఇబ్బందిగా మారాయి. అయితే దీన్ని కేవలం బాబు మాత్రమే స్పందించాల్సి వస్తోంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి.. టీడీపీ వెన్నెముకగా భావించి ఎంతోమంది సీనియర్లు.. ప్రభుత్వంపై నోరు మెదిపేందుకు వెనుకాడుతున్నారు. అచ్చెన్నాయుడు, చింతమనేని, యరపతినేని, మాజీ మంత్రులే జైలు పాలైతే తామెంత అనే ఆందోళన కూడా వారిలో లేకపోలేదు. మరోవైపు బాబు.. ఏపీ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటున్నారు. మోదీ ఉత్తముడంటూ కితాబిస్తున్నారు. ఇది బాబుకు కాస్త ఇబ్బందికరమే అయినా.. బీజేపీకు దగ్గర కావాలనే ప్లాన్ ఉందనే గుసగుసలూ లేకపోలేదు. ఏమైనా.. బాబు మనసులో కూడా ఏదో ఉంది. మరో సారి తాను కింగ్‌మేకర్ కావాలనే మార్గం వేసుకుంటున్నారనేది అందరినోట వినిపిస్తున్న మాట.