దూబే ఖేల్‌క‌తం!

కాన్పూర్ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మ‌య్యాడు. జులై 3న యూపీలోని బిక్రూగ్రామంలో 8 మంది పోలీసుల‌ను దారుణంగా హ‌త‌మార్చిన దూబేను గురువారం ఉజ్జ‌యిని అమ్మవారి ఆల‌యంలో నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య యూపీ, ఎంపీ పోలీసులు ప‌ట్టుకున్నారు. శుక్ర‌వారం ఉద‌యం కాన్పూర్‌కు త‌ర‌లిస్తుండ‌గా.. మార్గ మ‌ధ్యంలో త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. కానిస్టేబుల్ వ‌ద్ద రివాల్వ‌ర్ లాక్కుని కాల్పులు కూడా జ‌రిపాడు. దీంతో.. ప్రాణ ర‌క్ష‌ణ కోసం పోలీసులు జ‌రిపిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్‌స్ట‌ర్ మ‌ర‌ణించాడు. దాదాపు 25 ఏళ్లుగా.. వంద‌లాది నేరాలు చేసిన దూబేను ప‌ట్టుకోవ‌టం..అరెస్టు చేయ‌టం.. అత‌డు బెయ‌ల్‌పై రావ‌టం మామూలుగా మారాయి. ఒక హ‌త్య కేసులో విచార‌ణ‌.. మ‌రో బెదిరింపు కేసులో అరెస్టు కోసం పోలీసులు అత‌డి వ‌ద్ద‌కు బ‌య‌ల్దేరారు. అప్ప‌టికే దూబే ఇచ్చే డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డిన అవినీతి ఖాకీలు ముందుగానే స‌మాచారం లీకు చేశాయి. దీంతో దూబే త‌న‌ను ప‌ట్టుకునేందుకు వ‌చ్చిన పోలీసుల‌పై కాల్పులు జ‌రిపి 8 మందిని బ‌లితీసుకుని ద‌ర్జాగా అక్క‌డ నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్ చేరాడు. దాదాపు వారం రోజుల పాటు ఎక్క‌డెక్క‌డో తిరిగాడు. ఈ స‌మ‌యంలోనే పోలీసులు దూబే అనుచ‌రులు 8 మందిని ఎన్‌కౌంట‌ర్ చేసి లెక్క స‌రిచేశారు. ఉజ్జ‌యినిలో దూబే త‌న‌కు తానే లొంగిపోయాడా! ఎవ‌రైనా స‌మాచారం ఇచ్చారా అనేదానిపై బిన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఆల‌యంలోకి వెళ్లిన దూబేను అక్క‌డి పోలీసు గుర్తించి ప్ర‌శ్నించాడు. త‌న వ‌ద్ద వున్న న‌కిలీ ఐడీ కార్డుతో బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నించాడ‌ట‌. కానీ.. అక్క‌డే తెలివిగా వ్య‌వ‌హ‌రించిన ఆల‌య సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. యూపీ, ఎంపీ పోలీసుల‌కు అప్ప‌గించారు. అయితే నిజంగానే దూబే అరెస్టు వెనుక వాస్త‌వాలు ఏమిట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. దూబే నేరాల వెనుక పోలీసు అధికారులు, రాజ‌కీయ నాయ‌కుల‌కూ లాభం ఉంది. అయితే వారంతా ఏ పార్టీకు చెందిన‌వారు.. ఎందుకు అత‌డితో నేరాలు చేయించార‌నే ప్ర‌శ్న‌లు కూడా ఉన్నాయి. అరెస్టు త‌రువాత అత‌డి నుంచి కీల‌క స‌మాచారం సేక‌రిస్తార‌నే భావించారు. కానీ.. ఎక్క‌డో మూల‌న ఎన్‌కౌంట‌ర్ చేస్తార‌నే ఆలోచ‌న కూడా ఉంది. చివ‌ర‌కు అదే నిజ‌మైంది. క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తుడిని ఎన్‌కౌంటర్ చేయ‌టం స‌రైన‌దిగానే జ‌నం భావిస్తున్నారు. కానీ.. ఇటువంటి నేర‌స్తుల‌న పెంచి పోషిస్తూ లాభ‌ప‌డుతున్న అస‌లు సూత్ర‌దారులు ఎవ‌ర‌నేది మాత్రం ప్ర‌శ్న‌గానే మిగులుతుంది. ఒక వీర‌ప్ప‌న్‌, ఒక న‌యీం ఇలా.. నేర‌గాళ్లుగా మారేందుకు రాజ‌కీయ‌, పోలీసుల స్వార్థ ప్ర‌యోజ‌నాలు దాగుంటాయి. చివ‌ర‌కు గ‌న్ ప‌ట్టిన నేర‌స్తులు. అదే తుపాకీ తూటాకు బ‌ల‌వుతున్నారు. త‌మ‌ను పెంచి పోషించిన పెద్ద‌ల‌ను త‌ప్పిస్తున్నారు. ఇప్ప‌టికే దూబే
ఎన్‌కౌంట‌ర్‌పై కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాద‌వ్ బోలెడు ఆరోప‌ణ‌లు చేశారు. మ‌రి ఇవ‌న్నీ నిరాధార‌మా! దీనిపై యోగీ స‌ర్కారు విచార‌ణ చేయిస్తుందా అనేది కాల‌మే నిర్ణ‌యించాల్సిన స‌మాధానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here