ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు అసెంబ్లీ ప్రివిలేజ్ నోటీసు. అమాత్యులు పెద్దిరెడ్డిని ఇంటి నిర్బంధంపై సమాధానం ఇవ్వాలంటూ హూంకరింపు. దీనికి ప్రతిగా నిమ్మగడ్డ.. ఓస్ పోపోవోయి. నీలాటోళ్లను ఎంతమందిని చూళ్లేదు. నన్ను ప్రశ్నించే హక్కు మీ కమిటీకు లేదంటూ సమాధానం. నిన్ననే కొవిడ్ టీకా తీసుకున్నా.. ప్రయాణం చేయకూడదని వైద్యులు చెప్పారు. కాబట్టి.. ఇప్పట్లో ఇల్లు కదలి రాలేదు. మీకు వచ్చి సమాధానం ఇవ్వలేనంటూ ప్రత్యుత్తరం. మరి ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను అప్పనంగా లాక్కున్నారంటూ సీఐడీ కేసులతో చంద్రబాబు , నారాయణ ఇద్దరకూ ఊచలు లెక్కపెట్టడమే ఖాయమంటూ జబ్బలు చరచుకున్న వైసీపీ అండ్ కోకు ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు. అక్కడ ఇదే తంతు.. ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేశారు. అది కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. పాపం బాధితుల తరపున కొండంత మనసుతో పెద్దోడిగా పేదోడి తరపున వకాల్తా పుచ్చుకున్నారు. దీనిపై సీఐడీ కేసు నమోదు చేసింది. మాజీలకు నోటీసులిచ్చింది. అసలే చంద్రబాబు.. చట్టాల్లో లొసుగులు తెలిసినోడు.. చూద్దామంటూ సవాల్ విసిరారు. అంతే.. హైకోర్టుకు వెళ్లాక.. అసలు మీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటీ.. అంటూ సీఐడీను అడగటంతో ఇప్పుడిపుడే మేం ఆధారాలు సేకరిస్తున్నాం.. ఇప్పుడు చెబితే బాగోదంటూ ఏవో చెప్పాలని ప్రయత్నించినా న్యాయస్థానం.. గట్టిగానే మందలించి విచారణపై స్టే విధించింది.
గొంతులో వెలక్కాయపడినంత గా భావించి వైసీపీ శ్రేణులు.. చూశారా.. చంద్రబాబు చట్టాలు, న్యాయస్థానాలను ఎలా మేనేజ్ చేస్తున్నారో అంటూ మంత్రులు చెబుతున్నారు. కోర్టులు వదిలేసినా ప్రజాకోర్టులో బాబుకు శిక్షతప్పదంటూ అప్పట్లో అన్నలు చెప్పిన డైలాగ్‌లనే మంత్రి కొడాలి అనేశారు. నిజమే.. జగన్‌కు అంటిన అవినీతి మకిలిని చంద్రబాబుకు కూడా అంటించి తానేదో ఆనంద పడాలని చూస్తున్నారంటూ మాజీ మంత్రి నారా లోకేష్‌బాబు అననే అనేశారు. అయినా మా నాన్నారి చేతిమీద నెరిసిన వెంట్రుక కూడా పీకలేరంటూ తెగేసి చెప్పారు. అయినా.. మీ నాన్న వైఎస్ వల్ల.. మీ అమ్మ విజయమ్మ వల్లనే బాబును ఇబ్బంది పెట్టడం కుదర్లేదు. అటువంటిది నీ వల్ల ఏమౌతుందంటూ జగన్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు చినబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు అచ్చెన్న, కొల్లు రవీంద్ర , జేసీ బ్రదర్స్, భూమా అఖిలప్రియ, చింతమేని, యరపతినేని ఇలా..ఒకప్పుడు టీడీపీలో దమ్మున్న నేతలదందరికీ జైలు ఊచలు లెక్కపెట్టించారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు వైపే వైసీపీ టార్గెట్ గురిపెట్టడంతో పార్టీ శ్రేణులు ఉలికిపాటుకు గురయ్యాయి. కానీ అక్కడ వర్కవుట్ గాకపోవటంతో.. నెక్ట్స్ టీడీపీ నాయకుడు ఎవరనే ప్రశ్న తలెత్తింది. ఇది కూడా మనమంచికే అని టీడీపీ నేతలు అనుకుంటున్నారట. ఎందుకంటారా! బోలెడంత సానుభూతి.. పైసా ఖర్చులేకుండా విలువైన ప్రచారం రావటమే దీనికి కారణమట.



