ఏపీలో ఎన్నికల సమయం. ఐదేళ్లపాటు తాము అందించిన సంక్షేమ పథకాలు రెండోసారి సీఎంను చేస్తాయని చంద్రబాబు. ఈ సారి గట్టిగా కొడుతున్నా.. కాచుకో సీఎం మా జగన్ మోహన్‌రెడ్డి ఖాయమంటూ వైసీపీ. అబ్బే వీళ్లకు అంతసీన్ లేదు. మూడో ప్రత్యా మ్నాయం మేమేనంటూ ఎర్రజెండాతో దొస్తీ కట్టి జనసేన. మధ్యలో ఆటలో అరటిపండు లెక్క.. కేఏపాల్. ఇలా సంకుల సమరం మొదలైన వేళ. ఒక్కసారిగా సంచలనం. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాబాయి.. స్వయానా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమ్ముడు వివేకా నందరెడ్డి 2019 మార్చి 15న అనుమానస్పద స్థితిలో మరణించాడు. దీన్ని మొదట్లో గుండెనొప్పి తో మరణించినట్టు ప్రకటించారు. ఆ తరువాత తలకు బలమైన గాయాలు, శరీరంపై ఆయుధంతో దాడి చేసినట్టు ఆనవాళ్లు ఉండటంతో హత్యగా పోలీసులు ధ్రువీకరించారు. ఇదంతా నాటి సీఎం చంద్రబాబు చేయించాడంటూ వైసీపీ వర్గాలు ఆరోపించాయి. దీనిపై సీబీఐ విచారణ జరపాలంటూ జగన్ కూడా డిమాండ్ చేశాడు. నాటి సర్కారు దీనిపై సిట్ బృందాలతో దర్యాప్తు చేయించింది. దాదాపు 1500 మందిని ప్రశ్నించారు. మూడు సిట్ బృందాల దర్యాప్తులోనూ ఏమీ తేల్చలేకపోయారు. సాక్ష్యాధారాలు మాయం చేశారనే అభియోగంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేపోయారనే నింద పడ్డారట పాపం. ఈ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ కుటుంబంతో సన్నిహితం గా మెలిగే 10 మంది పేర్లను అనుమానితుల జాబితాలో ఉంచారు. అదే సమయంలో సుధాకర్‌రెడ్డి అనే అను మానితుడు అనుమాస్పదస్థితిలో మరణించాడు. ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టింది. దీనిపై ఈ ఏడాది మరోసారి సునీత హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి హత్యకేసులో నిందులెవరనేది తేల్చేందుకు దర్యాప్తు సీబీఐకు ఇవ్వాలని కోరారు. దీనిపై మార్చి 11న హైకోర్టు ఈ కేసును సీబీఐకు అప్పగించాలంటూ ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పులివెందుల చేరారు. అక్కడ పోలీసుల దర్యాప్తు వివరాలు, అనుమానితుల సమాచారం సేకరిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు గురైన ప్రదేశాన్ని సీబీఐ బృందం పరిశీలించింది.