ప్రేమ.. రెండు పదాలకు గొప్ప అర్ధం దాగుంది. హైటెక్ కల్చర్‌లో దాని విలువ మారింది. సరదాగా మాటలు కలవగానే ప్రేమ.. పెళ్లి అంటూ మితిమీరి ప్రవర్తిస్తున్నారు. తనపై కురిపించిన మాటలకు తడసిన ఓ ఆడపిల్ల.. ఓ మృగాడి చేతిలో ప్రేమమైకంలో ఎలా మోసపోయింది.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. ఎలా ప్రాణాలు తీసుకుందో చూడండీ. రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన త్రినయని అనే 20 ఏళ్ల యువతి. అక్షయ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లాడింది. అప్పటి వరకూ ఉన్న సరదాలు… బైక్ పై షికార్లు.. హోటల్‌లో విందులు.. పబ్‌లో పార్టీలు ఇవన్నీ ఉంటాయని ఊహించుకుంది. కానీ.. పెళ్లితరువాత ఎదురయ్యే చేదునిజాలను పసిగట్టలేకపోయింది. ఏడు నెలల క్రితం.. పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నారు. ఆ తరువాత ఆర్ధిక అవసరాలు.. ఇరువైపు పెద్దల సహకారం లేకపోవటం.. సరదాగా సాగాల్సిన కాపురంలో కలతలు రేకెత్తించాయి. భర్త నుంచి కూడా సూటిపోటిమాటలు.. మనసుకు గాయం చేసేలా ప్రవర్తనతో విసిగెత్తిపోయింది. ఇక నావల్ల కాదనే నిర్ణయానికి వచ్చినట్టుంది. పుట్టింటికి వెళ్దామంటే మనసొప్పలేదేమో.. ఎవరితో పంచుకోవాలో తెలియక.. ఎవర్నీ నిందించలేక.. రాంపల్లిలోని అత్తవారింట్లో ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వల్లనే తమ కూతురు బలవన్మరణం చెందిదంటూ త్రినయని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.



