ఏం మాస్టర్‌ప్లాన్. ఎలాంటి స్కెచ్. పక్కా ప్రొఫెషనల్ కిల్లర్స్‌కూ రాని ఆలోచనతో ఒక కిలేడీ స్కెచ్ గీసింది. అంతా సజావుగా జరిగుంటే తాను అనుకున్నట్టు జరిగేది. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. అడ్డంగా బుక్కైంది. పోలీసులకు పట్టుబడి జైలు ఊచలు లెక్కిస్తోంది. గుంటూరు జిల్లా కేంద్రంలో జరిగిన మర్డర్ మిస్టరీను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన దంపతులు గాలి సైదా, నాగుర్ బీ. ఇద్దరు పిల్లలతో కాపురం సాగిస్తున్నారు. ఇంతలో ఇద్దరి మధ్య మనస్పర్థలు. నాగుర్‌బీకు అక్కడ మోదుగుల పూర్ణచంద్రరావుతో అక్రమ సంబంధంతో గొడవలు మరింత పెరిగాయి. దీంతో నాగూర్‌బీ పిల్లల్ని తీసుకుని గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుతోటకు మకాం మార్చింది. అక్కడే చిన్న హోటల్ ఏర్పాటు చేసుకుని వ్యాపారం ప్రారంభించింది. భర్త కూడా దగ్గర లేకపోవటంతో ప్రియుడుతో సజావుగానే బందాన్ని కొనసాగించింది. కొద్దిరోజులకు గుంటూరుకు చెందిన షఫీ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. చీటీపాటలు నిర్వహిస్తూ తేలికగా డబ్బు సంపాదించటం ప్రారంభించింది. చీటిపాటలో మాజీ ప్రియుడు పూర్ణచంద్రరావునూ కలిపేసుకుంది. పూర్ణచంద్రరావు ఒత్తిడితో నాగూర్‌బీ మరో మహిళ శివకుమారిని పరిచయం చేసింది. దీంతో ఆ ఇద్దరి మధ్య అనైతిక బంధం ఏర్పడింది. నాగూర్‌బీ నడవడిక గురించి శివకుమారి పూర్ణచంద్రరావుతో తప్పుగా చెప్పింది. దీంతో ఆగ్రహించిన పూర్ణచంద్రరావు వెంటనే నాగూర్‌బీకు ఫోన్‌చేసి మందలించాడు. ఇక్కడే రంగంలోకి దిగిన నాగూర్‌బీ రెండో భర్త షఫీ జోక్యం చేసుకుని పూర్ణచంద్రరావును బెదిరించాడు.
ఇది మనసులో పెట్టుకున్న షఫీ ఎలాగైనా పూర్ణచంద్రరావును మర్డర్ చేయాలని భావించాడు. ముగ్గురు కుర్రాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నా చివర్లో వారు తాము కిడ్నాప్ చేస్తామని చెప్పటంతో ప్లాన్ విరమించుకున్నారు. మరోవైపు పూర్ణచంద్రరావు చీటి డబ్బులు లక్షరూపాయలు ఇవ్వాలంటూ నాగూర్‌బీపై ఒత్తిడి పెంచాడు. అదే సమయంలో షఫీతో నాగూర్‌బీ ఎలాగైనా పూర్ణచంద్రరావును చంపేస్తే తనతో ఉంటానంటూ తేల్చిచెప్పింది.
ఇక్కడే నాగూర్‌బీ మాస్టర్ ప్లాన్ ప్రయోగించింది. పూర్ణచంద్రరావును చంపటం ద్వారా లక్షరూపాయలు ఆదా అవుతాయని.. ఈ కేసులో షఫీను ఇరికించటం ద్వారా తన అడ్డు తొలగుతుందని భావించింది. అనుకున్నట్టుగా పూర్ణచంద్రరావుకు డబ్బులు ఇస్తానంటూ గుంటూరు రప్పించింది. ముందస్తు పథకం ప్రకారం రాజేష్ , కరీముల్లా, బీబీ ఆసియాలతో కలసి పూర్ణచంద్రరావు తన ఇంటికి రాగానే దాడిచేయించింది. కేబుల్‌వైర్లు, చున్నీతో పీకపిసికి చంపేశారు. పూర్ణచంద్రరావు మృతదేహాన్ని అనంతవరప్పాడు-డొంకరోడ్డు వద్ద మురుగుకాల్వలో పడేశారు. శవం వద్ద తన రెండో భర్త షఫీ ఆధార్‌కార్డు, కరెంటుబిల్లు తదితర వివరాలు క్లూ కోసం వదిలేసింది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కూపీ లాగారు. తెరవెనుక
కథంతా నడిపించిన నాగూర్‌బీను సహకరించిన ముగ్గురు యువకులనూ అరెస్ట్ చేశారు.