కరోనా భయాన్ని సొమ్ము చేసుకోవాలనే ఆశ. అడ్డగోలు దోపిడీకు తెగబడి 11 మంది మరణానికి కారకుడైన రమేష్ హాస్పిటల్స్ ఛైర్మన్ రమేష్ పరారీలో ఉన్నారు. నిజమే.. ఇది నమ్మి తీరాల్సిందే. ఒకప్పుడు ఆధునిక వైద్యానికి కేరాఫ్ చిరునామా గుంటూరు. జ్వరం నుంచి క్యాన్సర్ వరకూ అక్కడ అన్నిరకాల సేవలు లభించేవి. ఒకప్పుడు కేవలం విద్యకు కేంద్రమైన విజయవాడ క్రమంగా వైద్యానికి రాజదానిగా మారింది. వేల కొద్దీ ఆసుపత్రులు పుట్టుకొచ్చాయి. నాడిపడితే చాలు లక్షలు. ఆపరేషన్ చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతగా దోపిడీకు పాల్పడే అనేకానేక కార్పోరేట్ దందా సాగే విజయవాడలో కరోనా కాసులు కురిపిస్తుంది. హైదరాబాద్‌తో పోల్చితే కొంత బెటరే అయినా.. పల్లెప్రజలు ఆ మాత్రం కట్టాలంటే ఉన్నవి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు కరోనా బూచిని చూపుతూ రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కూడా రెండు స్టార్ స్థాయి హోటల్స్‌ను లీజుకు తీసుకుంది. వాటిలో ఒకటి స్వర్ణాప్యాలెస్. అక్కడ చికిత్సపొందుతున్న 40 మందిలో కేవలం 5-6 మందికి మాత్రమే కరోనా ఉందట. కానీ.. మిగిలిన వారందరినీ ఎందుకు ఉంచారంటే.. కేవలం భయం.. వారి అనారోగ్యాన్ని క్యాష్ చేసుకోవాలనే దురాశ అంటూ ప్రభుత్వ అధికారులే తేల్చిచెబుతున్నారు. అత్యవసర వైద్యసేవలు అందించే చోట.. పనిచేసే సిబ్బందికి పక్కాగా శిక్షణ ఉండాలి. కానీ.. ఇవేమీ లేకుండానే లీజు కోసం పెట్టిన పెట్టుబడికి వందరెట్లు సంపాదించాలనే ఆశతో తెగబడ్డారు. శానిటైజేషన్ అతిగా చేయటం వల్ల మంటలు చెలరేగి 11 మంది మరణానికి కారకులయ్యారు. దీన్ని స్వయంగా అంగీకరించిన ఆసుపత్రి ఛైర్మన్ రమేష్ మృతుల కుటుంబాలకు సంతాపం కూడా చెప్పారండో. ఆ తరువాత.. కేసు నమోదు చేశారని తెలియగానే మాయమయ్యారట. ఆయనతోపాటు.. స్వర్ణప్యాలెస్ ఛైర్మన్ శ్రీనివాస్ కూడా కనిపించట్లేదట. దీంతో పోలీసులు పరారీలో ఉన్న ఆ ఇద్దరి నిందితుల కోసం తెగ వెతుకున్నారట. మరి.. ఆ ఇద్దరూ పోలీసులకు చిక్కుతారా! ముందస్తు బెయిల్‌తో ఆసుపత్రిలో చేరతారా! కోర్టు ఎదుటకెళ్లి తప్పుచేశామంటూ ఒప్పుకుంటారా! ప్రభుత్వ పెద్దల సాయంతో కేసు నుంచి బయటపడతారా! బెజవాడ ప్రజలను మాత్రం ఇన్ని సందేహాలు వెంటాడుతున్నాయి.