బెజవాడ.. అనగానే గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన కనకదుర్గమ్మ. ఆసియాలో అతిపెద్ద వ్యాపార సముదాయం. అంతకు మించి చెప్పాలంటే ఒకప్పటి రాజకీయ రాజధాని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1990 వరకూ రాజకీయపరిణామాలకు వేదిక బెజవాడ. రైల్వేజంక్షన్, కాళేశ్వరావు మార్కెట్, పక్కనే కృష్ణమ్మ పరవళ్లు. 1970లో వామపక్షాలు చాలా బలంగా ఉండేవి. వాటిపై పై చేయి సాధించేందుకు కాంగ్రెస్ నానా కష్టాలు పడుతుండేది. పచ్చిగా చెప్పాలంటే ఎర్రజెండాలు.. వాటివెనుక ఉన్న నేతలు.. ప్రయివేటు పంచాయతీలు ఇవన్నీ ట్రెండ్‌కు రూపాలు. క్రమంగా వామపక్షాలు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు రౌడీలకు చోటిచ్చారు. వర్గాలను పెంచి పోషించారు. అలా పుట్టుకొచ్చిన రౌడీనేతలు.. వంగవీటి, దేవినేని కుటుంబాలు. వంగవీటి రాధా, దేవినేని మురళీ ఇలా మొదలైన రౌడీయిజం ఆధిపత్యం కోసం హత్యలు చేసుకునేంతగా మారింది. ఎన్ టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించటంతో బెజవాడలో దేవినేని వర్గం అటు చేరింది. దానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ వంగవీటిని చేరదీసింది. 1999 వరకూ ప్రతిరోజూ బెజవాడలో హత్యలు.. సెటిల్‌మెంట్లకు చోటుండేది. ఆ తరువాత సామాజిక చైతన్యం.. చదువులు.. మంచి ఉద్యోగాల దారిలో యువత రౌడీయిజం నుంచి బయటకు మళ్లారు. కానీ.. ఇప్పుడు సందీప్ హత్యతో మరోసారి రౌడీయిజం చాపకిందనీరులా పాకుతుందనే భయాందోళనలు లేకపోలేదు. బెజవాడలో ఆధిపత్యం సంపాదించి రౌడీగా ఎదిగేందుకు చాలా మంది ఆవారా ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. వాటిలో భాగమే చిన్నపాటి సెటిల్‌మెంట్లు. తాజాగా చిట్టినగర్ ప్రాంతంలో జరిగిన రౌడీవార్ వెనుక. వ్యక్తిగత కక్షలు లేవంటూ సందీప్ భార్య, తల్లి ఆరోపిస్తున్నారు. భూ సెటిల్‌మెంట్లు, రౌడీగా ఎదగాలనే ఆలోచనలే కారణాలుగా కొత్త విషయాలు వెలుఉలోకి వస్తున్నాయి.



