పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు మనసులో ఏముంది. వైసీపీ నుంచి దూరం జరగాలనుకుంటున్నారా! అధినేతకు కోపం వచ్చి గెంటేసేంత వరకూ తెచ్చుకోవాలనుకుంటున్నారా! విపక్షాలు కూడా జగన్ మోహన్‌రెడ్డితో కయ్యం ఎందుకని స్నేహహస్తం చాటుతుంటే.. రాజుగారు ఎందుకో రెడ్డి ప్రభుత్వం అంటూ వైసీపీ సర్కారును ఎద్దేవా చేస్తున్నారనేది అర్ధం కాని విషయం. సర్కారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుబట్టేది ఎవరంటే.. జనసేన, టీడీపీ బీజేపీ కాదు సుమా.. వైసీపీ ఎంపీ రఘురామరాజుగారే. అంతమాత్రాన తనకు రెడ్లంటే కోపం లేదంటారు.. రెడ్డి అనే పేరుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని మరీ పొంగిపోతున్నట్టు కనిపిస్తారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి పై అభిమానంతో తన మనవడుకు రాజశేఖర్‌రెడ్డి నామకరణం చేశానంటూ.. తనలోని వైఎస్సార్ వీరాభిమానాన్ని కూడా ప్రకటించారు. కానీ.. ఇప్పుడు వైసీపీలో అందరూ రెడ్డి సామాజికవర్గం వారే ఉన్నారంటున్నారు. ఔను మరీ.. టీడీపీ ఉన్నపుడు కమ్మలు.. వైసీపీ ఉన్నపుడు రెడ్లు.. రేపు జనసేన అధికారంలోకి వస్తే కాపులు. సీఎంగా ఎవరుంటే.. వారి వర్గానికే కదా! పేద్దపీట.. రాజుగారికి అన్నీ తెలుసు కానీ.. ఏపీలో రెడ్డిజం నడుస్తుందంటూ ఎందుకింతగా బాధపడుతున్నారో అర్ధంగాక వైసీపీ సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఈ మధ్య డిజిటిల్ మీడియాలో దేవేందర్‌రెడ్డి అనే వైసీపీ వీరాభిమాని రాజుగారి విగ్గు గురించి అవహేళన చేశారట. దీనికి కౌంటర్‌గా నా బొచ్చు ఏం పీకలేరనేంతగా రాజుగారు ఘాటుగానే బదులిచ్చారు. చివరకు హిందు, క్రైస్తవం అంటూ కాస్త మతాన్ని కూడా తీసుకొచ్చారండోయ్. బీసీలు, ఎస్సీలకు ప్రాధాన్యతనివ్వాల్సిన సీఎం సారు.. కేవలం పేరు చివర ఉన్న తోకకే జై కొడుతున్నారంటూ ఫాపం ఆవేదన కూడా వెలిబుచ్చారు. అమరావతి రాజధానికి మద్దతును మరింత బలం చేకూర్చేలా.. న్యాయపోరాటంలో అమరావతి రైతులే గెలుస్తారంటూ చురకేశారు. ఏమైనా.. రాజుగారు.. రోజుకో వివాదాన్ని వైసీపీ ప్రభుత్వం మెడకు చుడుతూ.. వారిని ఆత్మరక్షణలోకి నెడుతున్నాడు. ఇంతకీ.. ఎవర్ని చూసుకుని రాజుగారు ఇంత దైర్యంగా ఉన్నారని అడక్కండే.. ఎందుకంటే.. మొన్నీ మధ్యనే బీజేపీ సర్కారు.. 11 మంది భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది.
supper