పోతినేని రామ్ అలియాస్ రామ్.. దేవదాస్‌తో వెండితెరపై దూసుకొచ్చిన యువ నటుడు. యువ ప్రేక్షకులను తన ఎనర్జీతో ఆకట్టుకుంటున్నారు కూడా. తాజాగా కొన్ని వివాదాస్పద అంశాలపై ట్వీట్ చేసి తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నారు. విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో నడుస్తున్న కొవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగి 12 మంది మరణించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్ కేంద్రాన్ని నడుపుతున్న రమేష్ ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా కేవలం కక్షసాధింపు చర్యగా.. అసలు రమేష్ ఆసుపత్రికి సంబంధం లేదంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత తామే రెండు హోటల్స్‌ను కొవిడ్ కేంద్రాలుగా అద్దెకు తీసుకున్నామంటూ స్వయంగా రమేష్ ఆసుపత్రి చైర్మన్ పోతినేని రమేష్ తెలిపారు.
ఆ తరువాత రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 10 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. రమేష్ ఆసుపత్రిలో వాటాదారు అస్టర్ డీఎం హెల్త్‌కేర్‌కూ పోలీసులు నోటీసులు జారీచేశారు. దుబాయ్ కేంద్రంగా నడిచే ఈ సంస్థకూ రమేష్ ఆసుపత్రికి వ్యాపారలావాదేవీలున్నట్టు నిర్ధారించారు. ట్వీట్లు.. ఆడియోటేపులు కాదు.. ప్రత్యక్షంగా వచ్చి దర్యాప్తునకు పోలీసులకు సహకరించాలనేది పోలీసుల సూచన.
ఈ నిర్లక్ష్యం వెనుక రమేష్ యాజమాన్యమే కారణమంటూ ప్రాథమిక విచారణలో తేల్చింది. అయితే స్వర్ణ, రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కుటుంబంతో కలసి పారిపోయినట్టు గాలిస్తున్నట్టు వెల్లడించారు పోలీసులు. ఇదంతా తూచ్.. నేనెక్కడికీ పారిపోలేదంటూ ఓ ఆడియో టేపు విడుదల చేసిన రమేష్ దీన్ని కొట్టిపారేశారు. మళ్లీ దీనిపై దృష్టిపెట్టిన పోలీసులు ఆయన కలెక్టర్ రేట్ ప్రాంగణం నుంచి మాట్లాడినట్టు గుర్తించి అక్కడకు వెళ్లారు. తీరా.. అక్కడ ఆయన కారు వదిలేసి వేరే కారులో వెళ్లినట్టు తేల్చారు. ఇలా.. ఇరు వైపుల ఇటువంటి డ్రామా జరుగుతున్న సమయంలో నటుడు పోతినేని రామ్ ట్వీట్లతో హల్‌చల్ చేశాడు. జగన్ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించేందుకు అగ్నిప్రమాదం.. ఫీజులంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చారంటూ ట్వీట్ చేయటం సంచలనం రేకెత్తించింది. సర్లే.. బాబాయి తరపున అబ్బాయి అనుకున్నా.. కీలకమైన కేసు పోలీసులు విచారిస్తున్నపుడు పక్కదారి పట్టించే ప్రకటనలు చేయటం వారి విధులకు విఘాతం కలిగించినట్టే. ఇదే విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ ఘాటుగా స్పందించారు. ఇటువంటి ట్వీట్లు రిపీట్ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
దీంతో రామ్ తనకు చట్టంపై నమ్మకం ఉందని.. న్యాయం జరుగుతుందని.. నిందితులు శిక్షించబడతారంటూ ఇక ఈ కేసులో తాను జోక్యం చేసుకోనంటూ వివరణ ఇచ్చారు. ఇదంతా సగటు ఏపీ ప్రజలను విస్మయానికి గురిచేసింది. కరోనా లేని వారిని కూడా భయపెట్టి రోజుకు లక్ష రూపాయలు వసూలు చేసి.. నిర్లక్ష్యంతో 12 మంది ప్రాణాలు బలితీసున్న ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఇప్పటికే బాధిత కుటుంబాలకు ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి భారీ పరిహారం ప్రకటించారు. ఇటువంటి సమయంలో సమాజంపై ప్రభావం చూసే సినీరంగానికి చెందిన నటుడు రామ్ స్పందన వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నా… రామ్ చేసిన ట్వీట్లపై సోషల్ మీడియాలో విమర్శలు కురుస్తున్నాయి.



