కట్టల పాముల మించి.. బుసకొట్టి అక్రమాల నాగరాజ్. అదేనండీ కీసర తహసీల్దార్ నాగరాజు. మొన్నీ మధ్య ఓ భూ వివాదంలో రూ.1.15 కోట్లు లంచం తీసుకుని ఏసీబీకు చిక్కిన ఘనుడు. నిజంగానే అన్ని శాఖలూ కంగుతిన్నాయి. ఓర్నీ నాగరాజా.. ఎంత పేద్దమొత్తంలో గుంజేద్దామని ప్లాన్ చేశావంటూ నోరెళ్లబెట్టారు. రిటైర్‌మెంట్ వరకూ కోటి కూడా కూడబెట్టలేకపోయామంటూ బోరుమెన్న వాళ్లూ ఉన్నారట. ఆ తరువాత దర్యాప్తు చేసిన ఏసీబీకు నాగరాజ్ ఏకంగా రూ.150 కోట్లు ఆస్తులు కూడబెట్టినట్టు తేల్చారు. పైగా చాలామంది బినామీలు కూడా లెక్కతేలారట. వీరిలో కొందరు అమెరికా, జర్మనీ వంటి చోట ఉన్నారట. దీంతో అసలు గుట్టు వెలికితీసేందుకు ఏసీబీ అధికారులు తీగలాగితే డొంక కదిలినట్టు.. పెద్దతలకాయల పేర్లు బయటకు వస్తున్నాయట.
అంజిరెడ్డి అనే కాంగ్రెస్ నేత ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులకు మల్కాజగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి సంబంధించిన లెటర్‌ప్యాడ్స్, ఆయన పేరుతో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులు, సమాధానాలు ఉన్నాయట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భూముల ధరలు, రిజిస్ట్రేషన్ గురించిన ప్రశ్నలే ఆర్టీఐ దరఖాస్తుల్లో ఉన్నాయట. వీటి ఆధారంగా వివాదాల్లో ఉన్న భూముల చుట్టూ చేరి కోట్లు సంపాదించరట. దీనికి నాగరాజ్ వంటి తహసీల్దార్లు సాయం అందించినట్టుగా అంచనా వేస్తున్నారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నపుడు కూడా ఎమ్మెల్సీ కొనుగోలులో కోట్లు చేతులు మార్చుతూ ఏసీబీకు చిక్కాడు. ఆర్టీఐ సమాచార చట్టం ఉపయోగించుకుని చాలామంది అధికారులను బెదిరించేవాడనే ఆరోపణలున్నాయి. ఇటీవల కేటీఆర్‌కు సంబంధించిన ఫామ్‌హోస్ గురించి లొల్లి కూడా జరిగింది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని గట్టిగా కేసులో ఇరికించేందుకు ఇదంతా ఎవరైనా చేస్తున్నారేమో అంటూ హస్తం నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా భట్టి విక్రమార్క, హనుమంతురావు, కోమటిరెడ్డి బ్రదర్స్, జీవన్‌రెడ్డి వంటి వారు సీనియర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రేవంత్‌రెడ్డి వైపు మొగ్గుచూపుతుంది. రేపో.. మాపో పదవి ఖాయం అనుకున్న సమయంలో రేవంత్ ఊహించని విధంగా భూవివాదాల్లో చిక్కుకోవటం చర్చనీయాంశమైంది.



