
ఆ మాటలు… ఆ చూపులు.. నిజమని నమ్మారో.. అంతే సంగతులు. ఆడపిల్లలంటే అతగాడికి ఆటవస్తువు.. వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని సొమ్ము చేసుకోవటం మాయగాడి నైజం. సోషల్ మీడియాలో పరిచయాలను అవకాశం చేసుకుని పక్కా కన్నింగ్‌తో స్కెచ్‌గీస్తాడు. అదను దొరకగానే అందినంత దోచుకుంటాడు. కాదంటే.. ఇదిగో నువ్వు…నేను దిగిన ఫొటోలంటూ బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తన వలలో చిక్కిన ఆడపిల్లలకు మానసిక వేదన.. నిత్యం నరకం చూపించే మాయలమరాఠీ పేరు రాజ్‌కుమార్ కర్నూలు జిల్లాకు చెందిన ఇతడి పేరు రాజ్ కుమార్ పరిచయం ఉన్న అమ్మాయిలతో మాటకలుపుతాడు. సరదాగా మాట్లాడుతూ ట్రాప్ చేస్తాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా వారితో ఫొటోలు దిగుతాడు. అంతా బావుందనే నమ్మకం వచ్చాక.. అసలు మోసగాడు బయటకు వస్తాడు. తాను చెప్పినట్టు వినకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో ఉంచుతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తాడు. లైంగికంగా లొందీసుకుంటాడు. బంగారం, డబ్బు లాక్కుని సొమ్ము చేసుకుంటాడు. విలాసపురుషుడుగా ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన ఈ ప్రబుద్ధుడికి ఇది కొత్తేమీ కాదు. ఇప్పటికే దాదాపు పలు రాష్ట్రాల్లో 11 పోలీసు కేసులున్నాయి. గతంలో జైలుకెళ్లొచ్చినా తీరుమారని రాజ్ కుమార్ తన పాతబుద్దితో ఓ ఆడపిల్లను బెదిరించి పోలీసులకు చిక్కాడు.. జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.
కామాంధులు ఎందరో.. చుట్టూ ఉన్నారు
సోషల్ మీడియాలో ఇటువంటి మోసాలు కొత్తేమీ కాదు.. గతంలో హైదరాబాద్‌లో జావెద్, నల్లగొండలో మధు అనే కామాంధులు..ఇదే తరహాలో ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నారు. జావెద్ అనే బీటెక్ యువకుడు.. తాను ఆడపిల్లగా నమ్మించేవాడు. అమ్మాయిపేరుతో ఫేస్‌బుక్ ఖాతా ప్రారంభించాడు. కార్పొరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని పరిచయం పెంచుకునేవాడు. వారితో సాన్నిహిత్యం ఏర్పడ్డాక.. వారి నగ్నఫొటోలు తీసుకునేవాడు. ఆ ఫొటోలు తన చేతికి చిక్కగానే అసలు రంగు బయటపెట్టేవాడు.. తన వాంఛలు తీర్చాలంటూ వెంటపడేవాడు. కాదంటే… అడిగినంత డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేసేవాడు. కాదంటే.. మీ ఫొటోలు ఇంటర్నెట్‌లో ఉంచుతానంటూ బ్లాక్ మెయిల్ చేసి లక్షలు లాగాడు. ఓ ఇంటర్ విద్యార్థిని తన కు ఎదురైన ఇబ్బందిని తల్లికి చెప్పటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అలా ఇతగాడి బండారం బయటకు వచ్చింది. వందలాది మంది విద్యార్థినులు రక్షించబడ్డారు. మధు అనే ఫుడ్‌కార్పోరేషన్ ఉద్యోగి.. నిరుద్యోగ యువతులకు గాలం వేసేవాడు. ఇంటర్వ్యూ పేరిట నాగోలులోని కార్యాలయానికి పిలిపించిన తనలోని సైకోచేష్టలు చూపేవాడు. నిజంగానే ఉద్యోగం ఇప్పిస్తాడని వచ్చిన ఎంతోమంది అమాయక యువతులు మోసగాడి వలకు చిక్కారు. చివరకు పాపాత్ముడి బండారం బయట పడింది. పోలీసులు ఇతడి వికృతచేష్టలు చూసి ఆశ్చర్యపోయారు.. పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. సోషల్ మీడియాలో పర్సనల్ డిటైల్స్ ఉంచి.. ప్రమాదాన్ని తెచ్చుకోవద్దని సైబర్‌క్రైమ్ పోలీసులు యువతను హెచ్చరిస్తున్నారు. కొత్తవారితో తమ వివరాలు పంచుకోవద్దని సూచిస్తున్నారు. చుట్టూ దాగిన కామాంధులు.. స్నేహాన్ని నటిస్తూనే.. అదను చూసి కాటేసే కాలనాగులుగా మారతారని మరవొద్దని హితవు చెబుతున్నారు. నిజమే.. కళ్లెదుట ఎన్ని దారుణాలు జరుగుతున్నా.. యువత ఇప్పటికీ ఇటువంటి ఛీటర్స్ వలకు చిక్కి విలవిల్లాడుతున్నారు.



