ప్రశాంతమైన సాగరతీరం.. ఆహ్లాదకర వాతావరణం. కుల, మతాలకు అతీతంగా జీవించే ప్రజలు. కానీ.. అక్కడ రాజకీయాలు వీటన్నింటినీ కలుషితం చేస్తున్నాయి. సాగరనగరంలో విషబీజాలు నాటారు. దానితాలూకూ ప్రతిఫలం కనిపిస్తూనే ఉంది. 2014లో మొదలైన రచ్చ.. 2020 నాటికి తారాస్థాయికి చేరింది. దీనంతటికీ కారకులెవరు అనేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్. విశాఖపట్టణంలో మూడు నెలలు మూడు ఘోరాలు. ఎవరు దీనికి కారకులు. దీని వెనుక మానవ తప్పిదం ఉందా.. కావాలనే ఎవరైనా నడిపిస్తున్నారా? ఇవన్నీ బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధంకాని ప్రశ్నలు. ఇదంతా విశాఖపట్టణాన్ని రాజధాని నగరంగా
ఎంపిక చేసిన తరువాత మొదలైన ప్రమాదాలు కావటంతో దీనివెనుక కుట్రకోణం దాగుందంటూ అటు టీడీపీ, ఇటు వైసీపీ ఇరువర్గాలు ఆరోపించుకుంటున్నాయి. ఎల్జీపాలిమర్స్‌లో జరిగిన ఘోరం.. కొన్ని గ్రామాలను అక్కడ సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. పరవాడలోని జూన్ 29 సాయినాథ్ ఫార్మసీలో జరిగిన ప్రమాదంతో ఇద్దరు మరణించారు. ఆ తరువాత సాల్విన్స్‌లో ఘోర ప్రమాదం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. కిలోమీటర్ల దూరం పొగ చొచ్చుకు వచ్చింది. మంటలు చెలరేగాయి. దాదాపు 5 కిలోమీటర్ల దూరం మంటలు కనిపించాయి. 10 కిలోమీటర్ల మేర ద్వనులు వినిపించాయి. భయం గుప్పిట బతకాల్సి వస్తుందంటూ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2006లో విశాఖలో ఫార్మాసిటీకు 2400 ఎకరాలు కేటాయించారు. సుమారు 32000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాస్తవానికి ఫార్మసీ రంగం అంటేనే చాలా ప్రమాదకరమైన వాతావరణం. ఏ మాత్రం అలసత్వం చేసినా.. భద్రతను విస్మరించినా భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వందలాది రియాక్టర్లున్నాయి. ఒక్కోటి 1-!2 కిలోమీటర్ల వరకూ ఉంటాయి. ఇక్కడ భద్రత చాలా కీలకం. కానీ.. అక్కడ మాత్రం అధికారుల తనిఖీలు నామమాత్రం. భద్రత సంగతి గాలికొదిలేసిన నిఘా యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతుందనే ఆరోపణలున్నాయి. ఇవన్నీ కొద్దిసేపు పక్కనబెడితే.. వెంటాడుతున్న ప్రమాదాల వెనుక కుట్రకోణం దాగుందంటూ రాజకీయపార్టీలు సంచలనమైన ఆరోపణలు చేస్తున్నాయి. అమరావతి రాజధానిని తరలించటాన్ని జీర్ణించుకోలేని కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారంటున్నారు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా.. విశాఖప్రజలు
అభద్రత మధ్య నిత్యం భయంతో జీవిస్తున్నారు. మరి దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాల్సిందే.