కృష్ణాజిల్లాలో నందిగామకు ప్రత్యేక స్థానం. రాజకీయంగా.. సామాజికంగా.. ఆర్ధికంగా చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడ ప్రజలకు చైతన్యం కూడా ఎక్కువే. మారుతున్న కాలంతోపాటు నేరాలు కూడా పెరిగాయి. వైట్‌కాలర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. దీనికి తగినట్టుగానే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. నేరాలను కట్టడి చేస్తూ క్రిమినల్స్‌కు చుక్కలు చూపుతున్నారు. నందిగామ డీస్పీ మూర్తి బాధ్యతలు చేపట్టాక.. నేరగాళ్ల వెన్నులో వణకు మొదలైంది. సున్నితమైన అంశాలను కూడా చాలా చాకచక్యంగా డీల్ చేయటం ఆయనకే చెల్లింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసులకు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ.. నేరాలకు ముకుతాడు వేస్తున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రబాబు సారథ్యంలో పశ్చిమకృష్ణాలో కీలకమైన జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో నేరగాళ్లను కట్టడి చేయటంలో
సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా యువత ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వాటిలో గుట్కా చాలా కీలకం. సరదాగా మొదలైన గుట్కా అలవాటు ఎంతో విలువైన భవిష్యత్ ఉన్న యువతను నిర్వీర్యం చేస్తుంది. నందిగామ, కంచికచర్ల అడ్డాగా చేసుకుని గుట్కాను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముఠాలపై నందిగామ డీఎస్పీ మూర్తి సారథ్యంలోని స్పెషల్ పోలీసు బృందాలు దృష్టిసారించాయి. వందల కిలోల గుట్కాను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా కంచికచర్ల పట్టణంలోని జుజ్జూరు రోడ్డులో 5 కార్లలో తరలిస్తున్న నిషేధిత గుట్కాప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.50 వేల విలువైన పది కిలోల గంజాయను కూడా గుర్తించారు. నాలుగు కార్లు ఒక బొలెరో వాహనం 7 సెల్ఫోన్లు 13 వేల 500 రూపాయలు సీజ్ చేశారు. నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రవీంద్రబాబు వివరాలు వెల్లడించారు. వీటి విలువ దాదాపు రూ.70లక్షలు ఉంటుందని అంచనా వేశారు. భారీ ఎత్తున రవాణా అవుతున్న గుట్కాను కనిపెట్టి చాకచక్యంగా పట్టుకున్న నందిగామ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్, కంచికచర్ల ఎస్సై శ్రీహరి, నిఘా విభాగ ఎస్సై ఐ రమణ,ఎస్ బి కానిస్టేబుల్ మాధవరావు, ఎస్బి హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణస్వామి లను ఎస్పీ రవీంద్రబాబు, డీఎస్పీ మూర్తి అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు.



