పోటీచేసేందుకు అభ్యర్థులున్నారా! అసలు ఒక్క వార్డులో అయినా గెలవగలరా! ఒక్క గ్రామ పంచాయతీలో అయినా మీ జెండా ఎగురుతుందా! అంటూ ఎగతాళి చేసిన చోట జనసేన సత్తా చాటింది. పైసల్ పంచకుండా ఎవర్ని ప్రలోభ పరచకుండా కేవలం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను.. జనసేన నినాదాలతో వందలాది పంచాయతీలు, పదుల సంఖ్యలో మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు గెలుచుకున్నారు. ఇదంతా కేవలం మార్పు కోరుకునే ఓటర్లను ప్రభావితం చేయటం వల్ల గెలిచుకున్న ఓట్లు మాత్రమే విశాఖ నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోటీపడిన చాలా వార్డుల్లో జనసేన అభ్యర్థులు వైసీపీ, టీడీపీలకు ధీటుగా సమాధానమిచ్చారు. భారీగా ఓట్లను చీల్చటం ద్వారా టీడీపీను మూడో స్థానానికి నెట్టివేసిన ప్రాంతాలున్నాయి. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు.. జనసేన పుంజుకుంది. ఎస్సీలు, కాపులు, మైనార్టీలను తన వైపునకు మళ్లించుకుందనే సంకేతాలు పంపింది. ఈ ఒక్కటి చాలు భవిష్యత్‌లో ఏపీ రాజకీయాలను జనసేన ఎంతగా ప్రభావితం చేస్తుందనేందుకంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

2024 నాటికి జనసేన ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. గతంలో బీఎస్పీ, టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల జనసేన భారీగా నష్టపోయింది. ప్రయోగాలు చేద్దామని భావించిన జనసేనానిని అభాసు పాల్జేసింది. బీజేపీతో దేశ క్షేమం ఆశించిన జనసేనానికి బీజేపీ తెలంగాణ, ఏపీ పెద్దల చొప్పదాటు వైఖరి విసుగు తెప్పించింది. జనసేన అంటే చులకనగా మాట్లాడేంతగా ఏపీలో బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. పేరుకే సోము వీర్రాజు అధ్యక్షుడైనా.. అక్కడ పురందేశ్వరి, సుజనా చౌదరి వంటి నాయకుల మాటకే అదిష్ఠానం మద్దతు ఇస్తుందనేది మొన్నటి ఎన్నికల్లో తెలిసింది. సోము వీర్రాజును కేవలం ఉత్సవ విగ్రహంగా మార్చటంలో కొందరు బీజేపీ నేతలు కీలకంగా వ్యవహరించారనేది తెలుస్తోంది. బీజేపీ కూడా వైసీపీతో అంటకాగుతూ జనసేన నోరుమూసే ప్రయత్నం చేసింది. పైగా టీడీపీతో పవన్ దోస్తీ కట్టబోతున్నారనే విషప్రచారాన్ని తెరమీదకు తెచ్చింది.
ఇవన్నీ పవన్ కు మాత్రమే కాదు.. జనసైనికులకు చికాకు తెప్పించాయి. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అనుకున్నంతగా జనసేనకు తోడ్పాటును ఇవ్వ లేకపోయింది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో సేనాని రేపోమాపో బీజేపీతో తెగతెంపులు చేసుకునే అవకాశం ఉందనేది తెలుస్తుంది. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన బరిలోకి దిగటం అనివార్యంగా మారింది. ఇవన్నీ ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణలకు వేదికగా నిలిచాయి. 2024 ఎన్నికల నాటికి వైసీపీకు ధీటుగా జనసేన ఎదిగే అవకాశం వచ్చింది. టీడీపీ ఇప్పటికే గ్రామస్థాయిలో కేడర్‌ను దూరం చేసుకుంది. వైసీపీ సర్కారుకు భయపడిన పెద్ద నేతలు ఏ నాడో ఊరు దాటారు. చంద్రబాబు, లోకేష్ బాబు నాయకత్వంపై ఏపీ ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఇవన్నీ జనసేనకు అనుకూలంగా మారుతున్నాయి. స్థానిక పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీ ఓట్లను జనసేన భారీగా చీల్చింది. రాబోయే మూడేళ్లలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా జనసేన భారీగా చీల్చగలిగితే.. జనసేన మరింత బలపడుతుందనే విశ్లేషణలున్నాయి. ఇదే జరిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ వర్సెస్ జగన్ మధ్య మాత్రమే ఎన్నికల వార్ జరుగుతుందనేది మేధావుల అంచనా.



