అబ్బే.. మాకేం కాదు. మేం చాలా స్ట్రాంగ్. రోజూ వ్యాయామం చేస్తాం. ఫుల్‌గా బిర్యానీ లాగిస్తాం. మమ్మల్ని వైరస్ ఏం చేస్తుందీ! నిజమే ఈ ధీమా మంచిదే. కానీ.. అదే భరోసా కొంప ముంచుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రాణాల మీదకు తెస్తుంది. ఇదంతా ఏదో ఉబుసుపోక చెబుతున్న మాటలు కాదసుమా! కరోనా కేసుల్లో అధికశాతం బాధితులుగా మారుతున్న వారిలో 31-40 మధ్య వయసు ఉన్న పురుషులు/స్త్రీలు ఉంటున్నారు. మొదట్లో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవటంతో లైట్‌గా తీసుకుంటున్నారు. రెండోవారం వైరస్ తీవ్రత గుండె, కాలేయం, ఊపిరితిత్తులపై పడటంతో శ్వాస ఆడక ఆసుపత్రుల్లో చేరుతున్నారట. కరోనా భారిన పడుతున్నవారిలో 31-40 మధ్య వయసు ఉన్నవారు 24.47 శాతం తరువాత స్థానంలో 21-30 వయసులో 22.59 శాతం. 51-60 మధ్య వయసు వారిలో 14.38శాతం ఉంటున్నారట. 10 ఏళ్లలోపు పిల్లలు కేవలం 3.48శాతం మాత్రమే.
పిల్లల్లో ఎక్కువశాతం కొవిడ్19 లక్షణాలు కనిపించవు. దీంతో చిన్నారుల వల్ల పెద్దవాళ్లు తేలికగా వైరస్‌కు గురవుతున్నారని ఇటీవల పరిశోధనలో గుర్తించారు. కాబట్టి.. జ్వరం, దగ్గుతో పిల్లలు బాధపడుతుంటే.. వారికి 60 ఏళ్లు దాటిన పెద్దవాళ్లను దూరంగా ఉంచటం చాలా మంచిది అనేది వైద్యుల సూచన. ఏమైనా.. కరోనా భారత్‌ను కుదిపేస్తోంది. మరణాల రేటు తక్కువగా ఉండటం కాస్త ఊరటనే ఇస్తున్నా.. కేసుల సంఖ్య పెరగటం ఆర్ధికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా కూడా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 30 లక్షల కేసులున్నాయి. ఏపీలో 4 లక్షల కేసులకు చేరువ కాబోతుంది. వీరిలో 2.70లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో 1.10లక్షలకు చేరాయి. భారత్‌లో మరణాల రేటు కేవలం 1.86శాతం మాత్రమే. కోలుకుంటున్న వారి సంఖ్య 74.90శాతం కావటం కాస్త ఊరటనిచ్చే అంశం.