మావోయిస్టు లీడ‌ర్ గ‌ణ‌ప‌తి లొంగిపోతారా!

మావోయిస్టు టాప్ లీడ‌ర్‌.. దాదాపు మూడు దశాబ్దాల‌పాటు దొరక్కుండా త‌ప్పించుకుని ఉద్య‌మం న‌డిపిస్తున్న అగ్ర‌నేత గ‌ణ‌ప‌తి లొంగిపోతున్నార‌నే వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈయ‌న త‌ల‌పై దాదాపు రూ.2.5 కోట్ల రివార్డు కూడా ఉంది. ది మోస్ట్ వాంటెడ్ జాబితాలో నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ(ఎన్ ఐఏ) రూ.15లక్ష‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించింది. 75 ఏళ్ల గ‌ణ‌ప‌తి మూడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మావోయిస్టు కార్య‌ద‌ర్శిగా కూడా రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న్ను స్ట్రెచ్చ‌ర్‌పై మోసుకుని తిర‌గాల్సి వ‌స్తుందట‌. షుగ‌ర్‌, అధిక ర‌క్త‌పోటుతోపాటు.. కిడ్నీ సంబంధ‌మైన వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ట‌. అత్య‌వ‌స‌రంగా ఆసుప‌త్రిలోకి చేరాల్సిన ప‌రిస్తితిలో గ‌ణ‌ప‌తి లొంగుబాటుకు రంగం సిద్ధ‌మైంద‌ట‌. పోలీసు ఉన్న‌తాధికారులు, నిఘావ‌ర్గాల ద్వారా విష‌యంపై చ‌ర్చ కూడా జ‌రుగుతుంద‌ట‌. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌గిత్యాల‌కు స‌మీపంలోని బీరంగి గ్రామ నివాసి గ‌ణ‌ప‌తి. త‌ల్లిదండ్రులు శేష‌మ్మ , గోపాల‌రావు. 16 జూన్ 1949 పుట్టిన గ‌ణ‌ప‌తి అలియాస్ ముప్పాళ్ల‌ ల‌క్ష్మ‌ణ్‌రావు. ఉపాధ్యాయుడుగా ప‌నిచేశారు. ఆ త‌రువాత రాడిక‌ల్స్ భావ‌జాలానికి ఆక‌ర్షితుడై తుపాకీ ప‌ట్టారు. 2004లో పీపుల్స్‌వార్ పార్టీ చీలిక‌తో మావోయిస్టు పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎదిగారు. అప్ప‌టి నుంచి అన్నీ తానై న‌డిపిస్తున్నారు. కొండ‌ప‌ల్లి సీతారామ‌య్య‌తో క‌ల‌సి ప‌నిచేశారు. వ్యూహ‌క‌ర్త‌గా మంచి పేరుంది. ప్ర‌త్య‌ర్థుల‌ను కోలుకోలేని దెబ్బ‌తీయ‌టంలో అంద‌వేసిన చేయంటారు స‌హ‌చ‌రులు. తుపాకీ కాల్చ‌టం, బాంబులు అమ‌ర్చ‌టంతోపాటు.. అట‌వీప్రాంతంలో గొరిల్లా యుద్ధ‌తంత్రంలోనూ ప్ర‌త్యేక శిక్ష‌ణ పొందార‌ట గ‌ణ‌ప‌తి. గ‌ణ‌ప‌తికి ఎన్ని పేర్ల‌తో ఉండేవారు తెలుసా.. అస‌లు పేరు ముప్పాళ్ల లక్ష‌ణ‌రావు ఉద్య‌మంలోకి చేరాక‌.. సీఎస్‌, అజిత్‌, చంద్రశేఖ‌ర్‌, జీపీ, రాజ‌న్న‌, రాజిరెడ్డి, శ్రీనివాస్‌, ర‌మ‌ణ ఇలా మారుపేర్ల‌తో త‌ప్పించుకునేవార‌ని ఎన్ఐ ఏ త‌న రికార్డులో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here