తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 38,53,406. కొద్దిరోజుల్లోనే 50లక్షలకు చేరుకుంటామన్నమాట. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. అసలు కొవిడ్19 లక్షణాలే లేకుండా 40-50శాతం వైరస్ నుంచి బయటపడుతున్నారు. ఇటీవల అమెరికాలో ఇద్దరు వ్యక్తుల్లో రెండోసారి కరోనా భారినపడినట్టు గుర్తించారు. తెలంగాణలో కూడా వైద్యులు, వైద్యసిబ్బంది కూడా రెండోసారి మహమ్మారితో ఆసుపత్రిలో చేరారు. ఇది ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే.. అమెరికా, లండన్ వంటి అగ్రదేశాల్లో దీనిపై పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇండియాలో కూడా వైద్య పరిశోధకులు రెండోసారి వైరస్‌కు గురైన వారి జన్యుపరిణామంలో వచ్చినమార్పులు, వైరస్ తీవ్రత తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఇటువంటి సమయంలోనే హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక జన్యుపరిశోధన సంస్థ సీసీఎంబీ అద్భుతమైన అంశాన్ని ప్రకటించింది. కరోనా రెండోసారి సోకినా భయపడాల్సిన పనిలేదంటున్నారు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా. కరోనా సోకిన వారికి వ్యాధినిరోధకశక్తి పరిమాణాన్ని బట్టి నెలరోజుల లోపు యాంటీబాడీస్ తయారవుతుంటాయి. అయితే ఇవి కేవలం 3 నెలల మాత్రమే శరీరంలో ఉంటాయి. దీంతో యాంటీబాడీస్ తగ్గటంతో రెండోసారి అదే వ్యక్తులు కొవిడ్19 సోకే అవకాశం ఉందనేది పరిశోధనల సారాంశం. అయితే.. సీసీఎంబీ తాజాగా తెలంగాణలో చేసిన పరిశోధనలతో కొత్త విషయాన్ని గుర్తించారు. మొదటిసారి వైరస్ గురైనపుడు శరీరంలో యాంటీబాడీస్ పెరిగేందుకు కొంత సమయం తీసుకుంటుంది. అదే వైరస్ రెండోసారి వచ్చినపుడు శరీరంలోని కణాలు వెంటనే రియాక్ట్ అవుతాయి. రక్షణ కవచంగా యాంటీబాడీస్‌ను తయారు చేస్తాయి. కరోనా విషయంలో కూడా యాంటీబాడీస్ మాయమైనా.. శరీరంలో బి-లింఫోసైట్లు ఉండే కణాలు శరీరంలోకి కరోనా వైరస్ చేరగానే
మేల్కొంటాయి. మహమ్మారిని ఎదిరించేందుకు అవసరమైన ప్లాస్మా కణాలను విడుదల చేస్తాయంటారు రాకేశ్‌మిశ్ర. కాబట్టి వైరస్ తగ్గిన ఏ ఒక్కరూ అధైర్యపడవద్దు.. బెంబేలెత్తవద్దనేది ఆయన సూచన. పైగా.. బి-లింఫోసైట్లు శరీరంలో చాలా ఏళ్లపాటు ఉంటాయని భరోసా కూడా ఇస్తున్నారు. కాబట్టి.. కరోనా రాదనే ధీమా వద్దు.. వచ్చి తగ్గి మళ్లీ వస్తుందని బెంబేలెత్తవద్దు.