ఎవరీ.. నేనిలు.. ఎవరా నానీలు. అనుకోకండీ.. ఏపీలో రాజకీయాలంటే.. అసలు కంటే కొసరు ముద్దనేంతగా సాగుతాయి. నిన్నటి వరకూ.. సారీ.. ముందు రోజు వరకూ జైజేలు కొట్టించుకున్న నేతలు రాత్రికి రాత్రే పగోళ్లుగా మారతారు. అలాంటిది.. అధికారం తారుమారుకాగానే ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందంటారు.. ఎందుకీ సోది.. అసలు విషయంలోకి వద్దాం..!
2014-19 వరకూ టీడీపీ అధికారంలో చక్రం తిప్పిన టీడీపీ నేతలు ఎవరంటే.. చటక్కున గుర్తొచ్చేది దేవినేని ఉమామహేశ్వరావు, యరపతినేని శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్‌రావు, కేశినేని నాని.. ఇలా అందరూ నేనిలే అంతా తామై ప్రభుత్వాన్ని నడిపించారు. చంద్రబాబును పరుగులు పెట్టించారంటారు టీడీపీ అభిమానులు. కేంద్రంలో కేశినేని హవా కొనసాగితే.. ఏపీలో దేవినేని చక్రం తిప్పారు. పోలవరం, కృష్ణాపుష్కరాలు.. అబ్బో ఒకటేమిటీ.. నెంబరు 2 ఎవరంటే.. ఉమా అనేంతగా చెలామణీ అయ్యారు. మంత్రిగా కీలకంగా వ్యవహరించటంలో చురుగ్గా ఉన్నా.. తమ నియోజకవర్గంలో వేలు పెడుతున్నారంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు బోరుమన్నసందర్భాలూ ఉన్నాయట. విజయవాడలో కీలక నేత గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ అయితే. ఉమా అంటే గుర్రుగానే ఉన్నారు. వంశీ పార్టీ మారేందుకు ఉమానే కారణమనే ఆరోపణలూ లేకపోలేదు.
2019 వైసీపీ పీఠంపై కూర్చోగానే.. సీను రివర్స్ అయింది.. ఫైర్‌బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉండే చింతమనేనిపై కేసులుబయటకు తీశారు. అసలే మాజీ.. కాపాడేవారు లేని పరిస్థితుల్లో దాదాపు నెలకు పైగా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. పోనీ ఎవరైనా పాపం అన్నారా! అంటే అదీ లేదట. అబ్బయ్యచౌదరి దెబ్బ గట్టిగానే పనిచేసిందట. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని.. అసలు ఆయన బయటకు వస్తే… సీఎం కాన్వాయ్ కూడా సరిపోదనేంతగా చెలామణీ అయ్యేవారు. మైనింగ్ మాఫియాతో కోట్ల రూపాయల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కూడా చేపట్టాల్సి ఉంది. దేవినేని ఉమా.. పోలవరం అవినీతిలో ఆయనపై కేసులు. జైళ్లు తప్పవనే ఊహాగానాలు వచ్చాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం కృష్ణాపుష్కరాల సమయంలో ఘాట్‌ల నిర్మాణంలో అవినీతి అంటూ కొత్త పల్లవి అందుకుంది. నలుగురు ఇంజనీర్లపై కూడా కేసులు కట్టారు. దీంట్లో ఉమా ఎంత వరకూ ఇన్‌వాల్వు అయ్యారనేది తెలియాల్సి ఉందట. బెజవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీగా ట్వీట్లకే పరిమితమయ్యారు. దుర్గగుడి ఫ్లైఓవర్ తన హయాంలో వచ్చిందని చెప్పాల్సి వస్తోంది. అయితే.. వైసీపీలో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, కొడాలి నాని.. ముగ్గురు కూడా కరోనా సమయంలో.. ప్రభుత్వం తరపున మాట్లాడేందుకు.. ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు మైక్ ముందుకు వస్తున్నారు. దీంతో.. జనం కూడా నేనీలు పోయి.. నానీలొచ్చె ఢాం..డాం..ఢాం అని చర్చించుకోవటం కొసమెరుపు.




ప్రస్తుత పరిస్థితి కి అద్దం పడుతోంది