ఐదేళ్ల కాలంలో చంద్రబాబు అండ్ కో చేసిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో కూడా ప్రస్తావనకు తీసుకురావాలంటూ జగన్ తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేశారు. అమరావతి రాజధాని ప్రకటనకు ముందే బాబు అండ్ కో ప్రకటన చేయటంతో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపిస్తుంది. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సిట్ వేసిన ఏపీ ప్రభుత్వం ఇద్దరు రెవెన్యూ అధికారులను అరెస్ట్ చేశారు. ఆ తరువాత రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కూడా పూర్తి సమాచారం రాబట్టారు. అసెంబ్లీ సబ్‌కమిటీ ఏర్పాటు చేసి అమరావతి భూ సేకరణపై విచారణ చేపట్టారు. దాదాపు ఈ తప్పిదంలో ఎంతమంది ప్రముఖులు ఉన్నారనే విషయాలను కూడా రాబట్టారు. ఇప్పుడు దీన్ని పార్లమెంట్‌లో చూపుతూ టీడీపీ ప్రభుత్వం తద్వారా చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ విచారణ కోరనున్నారు. దీంతో మరోసారి రాజధాని భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే.. అక్రమంగా వేలాది ఎకరాలు తక్కువ ధరకు కొట్టేసిన వారిలో అన్ని పార్టీల నేతలు కూడా ఉండటంతో ఎవరికి వారు దీన్నుంచి బయటపడేందుకు సిద్ధమయ్యారు. తమను కాపాడే పెద్దల చుట్టూ తిరుగుతున్నారట కూడా. ఏమైనా… జగన్ ఏది చేసినా పకడ్బందీగా చేస్తున్నారు. చట్ట పరిధిలోకి తీసుకురావటం ద్వారా తన చేతికి మట్టి అంటకుండా జాగ్రత్త పడుతున్నారనేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. ఇప్పుడేం జరగబోతుందనేది ఒక్కసారి పరిశీలిద్దాం.
2014-19 వరక అమరావతి రాజదాని పేరిట భూముల అక్రమాలు జరిగాయంటూ మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తుంది. అధికారం చేపట్టాక దూకుడు మరింత పెంచింది. అమరావతి రాజధాని ముసుగులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వాదిస్తున్న అంశానికి బలం చేకూరేలా సీఎం జగన్ మోహన్‌రెడ్డి పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాజధాని ప్రకటన ముందే 4,500 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో బాలకృష్ణ బంధువు ఎంఎస్‌పి రామారావు, లింగమనేని రమేష్ భారీగా లాభపడినట్టు గుర్తించారు. ప్రకటనకు ముందుగానే బినామీ పేర్లతో అది కూడా తెల్లరేషన్‌కార్డు ఉన్న వారి ద్వారా వేమూరి రవికుమార్, పరిటాల సునీత, జీవిఆంజనేయులు, కంభంపాటి రామ్మోహనావు, పుట్టా, దూళిపాళ్ల నరేంద్ర భూముల కొనుగోలు చేశారంటూ ఆ నాడు సభలో కూడా వైసీపీ సభ్యులు ప్రస్తావించారు. 2019లో అధికారం చేపట్టాక దీనిపై సిట్ వేశారు. మంత్రిమండలి సబ్ కమిటీ వేసి విచారణ చేపట్టారు. దీనిలో భూముల కొనుగోళ్లలో అక్రమాలున్నట్టు తేల్చారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెర వెనుక సూత్రదారులను గుర్తించారు. దీనినే పార్లమెంట్‌లో ఉంచి సీబీఐ విచారణ కోరేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
ఇప్పటికే 280 రోజులుగా అమరావతి రాజధాని గ్రామాల ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. న్యాయస్థానం ద్వారా రాజధాని తరలింపును ఆపేందుకు సర్వశక్తులూ అడ్డుతున్నారు. వైసీపీలోని కొందరు నేతలు సైలెంట్‌గా ఉంటే… మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. జగన్ సర్కారు మాత్రం.. రాజధాని తరలింపు నిర్ణయం సరైనదే అని నిరూపించుకునేందుకు గత ప్రభుత్వ అక్రమాలను తెరమీదకు తెచ్చింది. పక్కాగా ఇది వాస్తవమని నిరూపించేందుకు ఉన్న అనువైన మార్గాలను ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పలుమార్లు.. దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకున్న చంద్రబాబు చుట్టూ ఆయన అనుంగులు చేసిన తప్పిదాలను ఉంచటం ద్వారా ఇరికించే ప్రయత్నం జరుగుతుందనే వాదన లేకపోలేదు. గతంలో కేంద్రంలో ఉన్న పెద్దలు, న్యాయనిపుణులు చంద్రబాబుకు సహకరించారనే గుసగుసలున్నాయి. ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ సహకారం ఎంత వరకూ అందుతుందనేది కూడా అనుమానమే. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న చంద్రబాబును దెబ్బతీసేందుకు ఇదే సరైన సమయంగా వైసీపీ ప్రభుత్వం లెక్కలు కడుతోంది. మరి ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందనేది చూడాలి.
ఎవరు ఇరికించనవసరం లేదు..ఖర్మ ఫలమే..