ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుమొఖం పట్టినట్లు అనిపిస్తుంది, అలాగే ఈ రోజు మరణాలు కూడా 51కి పడిపోయాయి.తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కరోనా శాంతించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే ప్రతి రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిశ్చార్జిలు కూడా పెరిగాయి. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 56,569 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 6,232 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 6,31,749కు చేరుకున్నాయి.
అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం కరోనా బారినపడి 57 మరణించగా, ఈరోజు ఆ సంఖ్య 51కి తగ్గింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,410కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో మరణాలు కృష్ణా జిల్లాలో 9 , చిత్తూరులో 7 , విశాఖపట్నంలో 6 , అనంతపురంలో 5 , తూర్పు గోదావరిలో 4 , గుంటూరులో 4 , నెల్లూరులో 4 , పశ్చిమ గోదావరిలో 4 , కర్నూలులో 3, కడపలో 2, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 1 గా నమోదు అయ్యాయి . అలాగే గత కొన్ని రోజులుగా డిశ్చార్జిలు కూడా ఏపీలో భారీగా పెరుగుతున్నాయి. సోమవారం 10,502 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు.



