భారత దేశపు జనాభా 2050 నాటికి 1.7 బిలియన్ లు తాకుతుందనేది అంచనా. అయినప్పటికీ ఆధునిక భారతంలో 48 శాతం గర్భాలు ఇష్టం లేకపోయినా, కావాలనుకోకపోయినా లేదా వద్దనుకొన్నా ఏర్పడుతున్నాయి. దీంతో ఎక్కువ శాతం మహిళలు గర్భస్రావాలు చేయించుకొంటున్నారు, అదీ ఒక సారి కాదు పలు మార్లు. దీంతో ఈ మహిళలు తీవ్రమైన రక్తస్ర్రావం, మానసిక సమస్యలతో పాటూ పలు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఆధునిక వైద్య విజ్ఞానం పెరిగే కొద్దీ వద్దనుకొనే వారి ద్వారా వేలాది గర్భస్రవాలు రోజూ జరుగుతున్నాయి.
ప్రస్థుత కాలంలో గర్భనిరోధకాన్ని మన జీవితంలో అంగీకరించిన సందర్భంలో, పాటించడానికి ఎన్నో రకములైన సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని వినియోగించడంపై ఎంతో గందరగోళానికి మహిళలలు లోనవుతున్నారు. ముఖ్యంగా వీటిపై ఉన్న పలు అపోహల కారణంగా జంటలు గర్భనిరోధకానికి సంబంధించిన నిర్ణయాలను పలు అబద్దపు నమ్మకాలు, సరైన సమాచారం పరిగణలోనికి తీసుకోకుండా తీసుకొంటున్నారు. ఇక ఈ విషయానికి సంబందించి ప్రచారంలో ఉన్న పలు ఆపోహలు, వారూ వీరు చెప్పిన మాటలు వినడం, సరైన అవగాహన లేకపోవడం, తెలియకపోవడం, ఇతరులు వినియోగించిన దానిపై ఖచ్చితమైన సాక్ష్యాలు అందుబాటులోనికి లేకపోవడం వంటి ఎన్నో కారణాలు ప్రజలలో అవగాహన లోపానికి కారణమవుతున్నది. దీంతో పాటూ పలువురు యువజంటలు గర్భనిరోదక సమాచారాన్ని తమ స్నేహితులు, కుటుంభ సభ్యులు లేదా ఇంటర్నెట్ ద్వారా సేకరించడం జరగడంతో పాటూ వైద్యులు సూచించిన మేరకు మందులు సమయానికి, ఖచ్చితంగా వాడకుండా మానివేయడం లేదా మందులు వేసుకోవడం మర్చిపోవడం జరిగి గర్భం దరించి తర్వాత అసలు విషయాన్ని దాచి దాన్నే నిజమని స్నేహితులకు చాటింపు వేయడం తో వారు దీనిపై సందేహాలు పెంచుకోవడం జరుగుతుంది.
పలు పరిశోదనలలో గర్భనిరోధంపై యువ జంటలలో సరైన సమాచారం లేదని తేలింది. వీరు గర్భం దరించకుండా ఉండడానికి లైంగికచర్య సమయాలలో కొన్ని భంగిమలు పాటించడం ద్వారానో లేదా బట్టలు ఉతకడం ద్వారానో లేదా లైంగిక చర్య తర్వాత వెంటనే స్నానం చేయడం లేదా జననేంద్రియాలను కడుగుకోవడం ద్వారానో గర్భాన్ని నిరోధించవచ్చని భావిస్తున్నారు. ఇక గర్భం రాకుండా నిరోధించడం అనే విషయానికి సెక్స్ ద్వారా వచ్చే అంటువ్యాధులు రాకుండా అడ్డుకోవడం అనేది వేర్వేరు అంశాలనేది వీరు అర్థం చేసుకోవడం లేదు. కేవలం ఇందుకోసమైతే కండోమ్ ల వినియోగాన్ని సరిగ్గా చేస్తే చాలని వీరనుకోవడం లేదు. చాలా మందిలో కండోమ్ కేవలం సెక్స్ ద్వారా వచ్చే అంటువ్యాధులను అడ్డుకోవడానికి మాత్రమే అని భావిస్తూ అది గర్భనిరోధకానికి పనికివస్తుందనుకోవడం లేదు. అది పెద్ద తప్పు, కండోమ్ అనేది గర్భనిరోధకంతో పాటూ అంటువ్యాధులను అరికట్టడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.
ఇక కండోమ్ తో పాటూ గర్భ నిరోధకానికి ఎన్నో ఇతర సాదనాలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఈ 21 వ శతాబ్దంలో ఎందుకో జంటలు వీటిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం లేదనిపిస్తోంది. అందుకు ప్రధానంగా పైన పేర్కొన్నట్లు అపోహలు, సరైన సమాచారం లేకపోవడం, తప్పుడు నమ్మకాలు వంటివి కారణమై వారిని గందరగోళపరుస్తున్నాయనే చెప్పవచ్చు. అందుకే వారు ఎపుడు గర్భం వస్తుందోననే భయంతో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు తప్ప దానిని ఆపడానికి ప్రయత్నించడం లేదు. దీంతో పాటూ మన సమాజంలో ఈ విషయంలో భాద్యతంతా స్త్రీపైనె నెట్టివేయడం మరో సమస్య. ఇలాంటి వాటికన్నింటికి పరిష్కారంగా ఈ రోజు మన సమాజంలో ఉన్న అపోహలు, వాటికి సంబంధించిన సరైన సమాచారం పై దృష్టి కేంద్రీకరిస్తాం……
అపోహ 1 – సురక్షితమైనదే అత్యంత నమ్మకమైనది
నిజం – కొన్ని జంటలు మహిళ పీరియడ్స్ కు సంబంధించిన కాలండర్ ను దృష్టిలో ఉంచుకొని సాధారణంగా రుతుస్రావం జరిగిన తర్వాత 11 లేదా 18 వ రోజున లైంగిక చర్యలో పాల్గొనడం ద్వారా గర్భం రాదని నమ్ముతుంటారు. కాని ఇది సరి కాదు. మహిళల రుతుస్రావానికి చెందిన కాలండర్ లో నిత్యం మార్పులు సహజం. కొన్ని సందర్భాలలో ముందుకు జరగడం లేదా ఆలస్యం కావడం సర్వ సాధారణం. దీంతో జంటలు వేసుకొనే ఈ లెక్కలు తప్పి గర్భం దరిస్తూ ఉంటారు. ఇక పీరియడ్స్ కు ముందు లేదా తర్వాత లైంగిక చర్యలలో పాల్గొనడం సురక్షితం కూడా కాదు. ఎందుకంటే వీర్యకణాలు మహిళల యోనిలో కొన్ని రోజుల పాటూ ఉండిపోతాయి కాబట్టి.
అపోహ 2 – విత్ డ్రాయిల్ టెక్నిక్ చాలా సురక్షితం
నిజం – కొన్ని జంటలు ఏమని భావిస్తాయంటే లైంగిక చర్య సందర్భంగా మగవారు వీర్యాన్ని జారవిడిచే సందర్భంలో వైంగికచర్య నుండి ఉపసంహరించుకొంటే గర్భం రాదని భావిస్తాయి. అది తప్పు అనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో వీర్యం ముందుగానే జారిపోయి పురుషాంగం స్రవించే ద్రవాలలో లేదా పురుషాంగం చివర మిగిలిపోయి, ఉపసంహరించుకొనే సందర్భంలో ఇవి యోనిలో జారిపోతే గర్భం వచ్చే అవకాశముంటుంది. గర్భం దరించాలంటే కేవలం కొన్ని వీర్యకణాలు ఉంటే సరిపోతుంది.
అపోహ 3 – అన్ని రకములైన గర్భనిరోధక సాధనాలు పూర్తిగా సురక్షితమైనవి…
నిజం – రుతుస్రావ కాలెండర్ లేదా లైంగికచర్య నుండి ఉపసంహరించే పద్దులలో 25 శాతం విఫలమవుతున్నాయి. ఇక కండోమ్స్ లో 13 శాతం, గర్భనిరోధక మాత్రలకు సంబంధించి 4 శాతం, గర్భనిరోధక ఇంజక్షన్లు 6 శాతం, లూప్ లాంటి యోనిలో ప్రవేశ పెట్టే గర్భనిరోధక సాధనాలలో 0.2 నుంజడి 0.8 శాతం విఫలమవ్వచ్చని పరిశోనలు చెబుతున్నాయి. అందుకే గర్భనిరోధక సాధనాలను వైద్యుల సూచనల మేరకు ఖచ్చితంగా సరైన పద్దతిలో వినియోగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.
అపోహ 4 – గర్భనిరోధక మాత్రలను ఉపయోగించడం వలన బరువు పెరగడం, గర్భం ధరించే సామర్థ్యాన్ని కోల్పోవడం, పుట్టే పిల్లలలో జన్యుపరమైన లోపాలు ఉండడం, క్యాన్సర్ మరియు రక్త నాణాలలో గడ్డలు ఏర్పడడం వంటివి జరుగుతాయి?
నిజం – ఆధునిక వైద్య విజ్ఞానంతో రూపొందించబడిన ప్రస్థుత గర్భనిరోధక సాధనాల కారణంగా బరువు పెరుగరు. ఇదంతా వారి వారి జీవన శైలి కారణంగా జరుగుతుంది తప్ప వీటి వలన కాదు. ఈ మాత్రల వినియోగం ఆపిన నెల తర్వాత వీరు గర్భం ధరిస్తారు కాబట్టి క్యాన్సర్లకు అవకాశం లేదు. అయితే కొన్ని పరిశోధనలలో వీటి కారణంగా రొమ్ము క్యాన్సర్ వస్తుందని తెలుస్తున్నా వాటిని ఆపివేస్తే మాత్రం ఆ ప్రమాదం లేదు. ముఖ్యంగా 35 సంవత్సరములకు పైబడి దూమపానం చేస్తూ, రక్తనాళాలు గడ్డకట్టే చరిత్ర ఉండి, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి రుగ్మతలు ఉన్న వారికి మాత్రం కొంత మేర ఇబ్బందులు వస్తున్నాయి.
అపోహ 5 – కాపర్ టీ, లూప్ వంటి యోనిలో ప్రవేశపెట్టబడే గర్భనిరోధక సాధనాల కారణంగా ఎక్కువ కాలం రుతుస్రావద్రవాలు రావడం, బరువు పెరగడం, అవి జారిపోయే ప్రమాదం తో పాటూ గర్భస్రావం తో గర్భాన్ని తీసివేయచ్చనే అంశాలపై….
నిజం – కాపర్ టి లేదా లూప్ అనబడే యోనిలోనికి ప్రవేశ పెట్టే సాధనాలు కొన్ని సందర్భాలలో గర్భం దరించడానికి ఇబ్బందులుగా మారుతాయి. అయితే ఇవి బరువు పెంచవు. కొన్ని సందర్భాలలో మహిళలు ఎక్కువ రక్తస్రావం లేదా పీరియడ్స్ సమయాలలో నొప్పి లేదా సరైన సమయపట్టి లేకుండా రుతుస్రావం జరుగడం వంటి వాటికి అవి ప్రవేశపెట్టిన మొదటి రెండు లేదా మూడు నెలలో చూస్తారు. అయితే ఇపుడు అందుబాటులో ఉన్న పలు అత్యాధునిక సాధనాల కారణంగా ఈ ఇబ్బందులు తగ్గాయి.
అపోహ 6 – ఇంజక్షన్స్ ద్వారా తీసుకొనే గర్భ నిరోధకాలు సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉన్నాయి?
నిజం – సాధారణంగా ఇంజక్షన్స్ ద్వారా తీసుకొనే గర్భనిరోధక మందును నెలకు మూడు సార్లు మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ ఇంజక్షన్లు పీరియడ్స్ ను ఆలస్యం చేయడం లేదా సరైన సమయానికి కాకపోవడం లేదా అసలు పూర్తిగా నిలిచిపోవడం కారణంగా భారతీయ మహిళలు దీనిపై అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు. వీటిని తీసుకొన్న తర్వాత గర్భం ధరించడానికి కొంత సమయం పడుతుంది. అంతే గాకుండా వీటి కారణంగా ఎముకలలో సాంద్రత తగ్గుతుంది.
అపోహ 7 – పుట్టిన బిడ్డకు పాలిస్తుంటే గర్భం ధరించరు?
నిజం – పిల్లలకు పాలిస్తుంటే గర్భం ధరించరు అంటే పూర్తిగా తప్పుడు సమాచారమే. ప్రసవం జరిగిన తర్వాత వచ్చే మొదటి పీరియడ్స్ తర్వాత 2 వారాల నుండి ఎపుడైనా గర్భం దరించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రసవం జరిగిన తర్వాత మూడు నెలల కాలం నుండే లేదా ముందు నుండే గర్భనిరోధక సాధనాలు వినియోగించడం మంచిది. అయితే ఇందుకోసం హార్మోన్ మాత్రలు వినియోగించే సందర్భాలలో మాత్రం వైద్యులను సంప్రదించాలి ఎందుకంటే వీటిని వినియోగించడం వలన పాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
అపోహ 8 – అన్ని గర్భనిరోధక సాధనాలు సెక్స్ కారణంగా వచ్చే అంటు వ్యాధులను నిరోధిస్తాయని భావించడం
నిజం – సెక్స్ ద్వారా వచ్చే అంటు వ్యాధులను కేవలం కండోమ్స్ మాత్రమే నిరోధించగలవు. ఇతర గర్భనిరోధక సాధనాలు ఇందుకు పనికి రావు.
అపోహ 9 – అత్యవసర సమయాలలో వినియోగించే గర్భనిరోధక మాత్రలు ఐ పిల్ లేదా అన్ వాంటెడ్ 72 లాంటి మాత్రలను సెక్స్ చేసిన ప్రతి సారీ వినియోగించడం ద్వారా గర్భం నిరోధించవచ్చా?
నిజం – అత్యవసర సమయాలలో వినియోగించడానికి సూచించిన మాత్రలను ఆయా సందర్భాలలో మాత్రమే వినియోగించాలి. ప్రతి సారీ వినియోగిస్తే మాత్రం ఎక్కువ శాతం హార్మోన్ లను ఉత్పత్తి చేయడం ద్వారా తదుపరి పీరియడ్స్ కాలెండర్ ను మార్చి వేసే ప్రమాదం ఉంది.
అపోహ 10 – రెండు కండోమ్ లను ఒకే సారి తొడిగి వినియోగించడం ద్వారా ఎక్కువ సురక్షత లభిస్తుంది?
నిజం – ఇలా వినియోగించడం వలన అవి చిరిగిపోవడం లేదా సరిగ్గా తొడుక్కోలేక పోవడం లేదా జారిపోవడం వంటి కారణాలతో గర్భనిరోధకం కాకుండా విఫలమవ్వచ్చు.
అపోహ 11 – 35 సంవత్సరములు దాటిన మహిళలలకు గర్భం వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి వారు వినియోగించాల్సిన అవసరం లేదు?
నిజం – ఇది తప్పు. పలు సందర్భాలలో 35 సంవత్సరములు మళ్లిన మహిళలు గర్భం సాధారణంగా ధరించడం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని సందర్భాలలో పీరియడ్స్ ఆలస్యం కావడం లేదా నిలిచిపోవడాన్ని మహిళలు మెనోపాజ్ గా భావించడం జరుగుతుంది అయితే అది సరైనది కాదు.
అపోహ 12 – పురుషులలో గర్భనిరోధక శస్త్ర చికిత్స అయిన వాసెక్టమీ చేయడం కారణంగా పలు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
నిజం – ఇది తప్పు. మహిళలకు చేసే గర్భనిరోధక శస్త్ర చికిత్స కన్నా పురుషులలో చేసే శస్త్ర చికిత్స చాలా సరళమైనది. ఇది కేవలం వీర్యాన్ని తీసుకొనే వెళ్లే నాళాలను కేవలం ముడి చేయడమనే శస్త్ర చికిత్స మాత్రమే. దీని వలన ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.
ఆపోహ 13 – మహిళలకు నిర్వహించే గర్భ నిరోధక శస్త్ర చికిత్స తర్వాత చాలా విశ్రాంతి అవసరం…
నిజం – మహిళలకు చేసే గర్భ నిరోధక శస్త్ర చికిత్స లాప్రోస్కోపిక్ పద్దతితో నిర్వహిస్తారు. దీనికి సుదీర్ఘకాలం విశ్రాంతి అవసరం లేదు. ఇది అపోహ మాత్రమే.
ప్రతి గర్భనిరోధక సాదనానికి కొన్ని పరిమితులు మరికొన్ని లాభాలున్నాయి. అందుకే తమ జీవన శైలికి తగినట్లుగా సురక్షితమైన గర్భనిరోదక సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. మీ అవసరాలు మారిన ప్రతి సందర్భంలో వాడే గర్భనిరోధక సాధనాన్ని మార్చడం చేయాలి. అందుకే ఈ అంశంపై అపోహలు విడనాడి ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకొని ముందుకు సాగాలి.
అయితే గర్భ నిరోధకం వలన లభించే లాభాల తో పోలిస్తే కొన్ని ఇబ్బందులు సహించడంలో తప్పు లేదు. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం మీ చేతుల్లోనే. అందుచే ఈ విషయంపై మాట్లాడడం మొదలుపెట్టండి.
– Dr. Swathi Gogineni, Consultant Gynecologist and Obstetrician, Apollo Cradle & Children Hospital, Jubilee Hills, Hyderabad



