వైసీపీ ఫైర్‌బ్రాండ్ కొడాలి సైలెన్స్‌.. జ‌గ‌న్ ఆగ్ర‌హ‌మే కార‌ణ‌మా??

ఏపీ మంత్రివ‌ర్యులు.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైలెంట్ అయ్యారు. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న త‌రువాత ఆయ‌న‌లో ఏదో తెలియ‌ని మార్పు వ‌చ్చిన‌ట్టుంది. అక‌స్మాత్తుగా మారిపోయారు. ఎందుకిలా? అస‌లు ఏం జ‌రిగింది? అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి క్లాసు తీసుకున్నారా? సామాజిక‌వ‌ర్గ నేత‌ల నుంచి ఏమైనా సూచ‌న‌లు అందాయా? హిందు సంఘాల నిర‌స‌న‌ల‌తో మారిపోయారా? అస‌లేం జ‌రిగింది. ఫైర్‌బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా క‌నిపించే కొడాలి. ఎందుకిలా మారిపోయార‌నే ప్ర‌శ్న‌కు ఏపీలో స‌మాధానం దొర‌క‌టం లేద‌ట‌. తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొనేందుకు సీఎం జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం అక్క‌ర్లేదంటూ జ‌గ‌న్ బాబాయి టీటీడీ ఛైర్మ‌న్ కె.వి.సుబ్బారెడ్డి సెలవిచ్చారు. అంత అక‌స్మాత్తుగా ఆ అంశాన్ని తెర‌మీద‌కు తీసుకురావ‌టం వెనుక కార‌ణం. రాజ‌కీయ‌మేనంటూ విప‌క్ష నేత‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఏపీలో వ‌రుస‌గా హిందు దేవాలయాల‌పై దాడుల నేప‌థ్యంలో కే.విసుబ్బారెడ్డి వ్యూహాత్మ‌కంగా తిరుమ‌ల డిక్ల‌రేష‌న్ విష‌యాన్ని తెర‌మీద‌కు తెచ్చార‌నే వాద‌న లేక‌పోలేదు.

తిరుమ‌ల డిక్ల‌రేష‌న్‌, హిందుదేవాల‌యాల‌పై దాడుల నేప‌థ్యంలో మంత్రి కొడాలి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హిందు ధార్మిక సంస్థ‌లకు కోపాన్ని తెప్పించారు. ర‌థం త‌గుల‌బ‌డితే ఏమౌతుంది. దేవాల‌యంలో వెండి సింహాలు పోతే ఏమౌతుంది. అస‌లు తిరుమ‌ల‌లో డిక్ల‌రేష‌న్ ఒట్టి బూట‌కం. డ‌బ్బులు పెడితే వ‌చ్చేవాటి కోసం ఎందుకిలా రచ్చ చేస్తున్నారంటూ హిందుల మ‌నోభావాల‌ను దారుణంగా దెబ్బ‌తీశారు. దీనిపై బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ త‌దిత‌ర ప్ర‌ధాన పార్టీల‌న్నీ నిర‌స‌న‌కు దిగాయి. కొడాలి దిష్టి బొమ్మలు ద‌హ‌నం చేశారు. జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న లోనూ కొడాలి ఘాటుగానే స్పందించారు. ఇది నాణేనికి ఒక వైపు మాత్ర‌మే . మ‌రో వైపు చంద్ర‌బాబుపై కోపాన్ని ప్ర‌ద‌ర్శించారు. రాసేందుకు వీలులేని భాష‌ను ఉప‌యోగించి మ‌రీ తిట్ల పురాణం అందుకున్నారు. వైసీపీ ను మాటంటే నేనున్నానంటూ ప్ర‌తి దాన్నీ తాను భుజానెత్తుకుని జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ, క‌ర‌ణం బ‌ల‌రాం, మ‌ద్దాల గిరి వంటి టీడీపీ ఎమ్మెల్యేలే వైసీపీ వైపు రావ‌టానికి కొడాలి చ‌క్రం తిప్పార‌నేది కూడా బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

అమ‌రావ‌తి రాజ‌ధానిపై కూడా కొడాలి కామెంట్స్ రాజ‌ధాని రైతుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశాయి. క‌మ్మ సామాజిక‌వ‌ర్గ నేత‌లు, ప్ర‌ముఖులు ప‌రోక్షంగా, ప్ర్య‌త‌క్షంగా అమ‌రావ‌తి రాజ‌ధాని త‌ర‌లింపును వ్య‌తిరేకిస్తున్నారు. రైతుల దీక్ష‌కు సంఘీభావం చెబుతున్నారు. న‌ర్స‌రావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు కూడా అమ‌రావ‌తి రైతుల‌కు న్యాయం జ‌రిగేలా చూస్తానంటూ హామీనిచ్చారు. కొడాలి మాత్రం అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్లు ఇవ్వ‌క‌పోతే రాజ‌ధాని అక్క‌ర్లేదంటూ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి విన్న‌విస్తానంటూ మ‌రింత ఆజ్యం పోశాడు. ఇలా.. పార్టీలోనూ.. హిందు సంఘాలు.. క‌మ్మ సామాజిక‌వ‌ర్గంలోనూ కొడాలి పెద్దఎత్తున వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ఇదంతా కొడాలి వ్య‌క్తిగ‌త‌మంటూ స‌జ్జ‌ల‌, విజ‌యసాయిరెడ్డి వంటి పార్టీ పెద్ద‌లే స‌మ‌ర్ధిస్తూ వ‌చ్చారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీను కూడా దెబ్బ‌తీసే అవ‌కాశం ఉంద‌నే ఆందోళ‌న‌తో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కొడాలిని సైలెంట్ గా ఉండ‌మ‌ని సూచించార‌ట‌. అది సూచ‌నా.. లేక‌పోతే హెచ్చ‌రికా అనేది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన్న మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌కు క‌రోనా పాజిటివ్ అని స్వ‌యంగా ప్ర‌క‌టించారు. మిగిలిన నేతలు కూడా ఇంటికే ప‌రిమితం కావ‌టం కూడా ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

Previous articleఅమెరికాలో ఆంధ్ర ‌రాజ‌కీయం!
Next articleమెగాస్టార్‌.. సైరా క‌ల నెర‌వేరి ఏడాదైంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here