చిరంజీవి.. స్వయంకృషితో ఎదిగిన నటుడు. ఎంతోమందికి స్పూర్తి కూడా. కానీ ఆయనకూ తీరని కోరికలు ఎన్నో ఉన్నాయి. అందుకే పలు ఇంటర్వ్యూల్లో నటుడుగా తాను ఇష్టపడిన ఎన్నో పాత్రలు చేయలేకపోవటాన్ని గుర్తుచేసుకుంటారు. తనయుడు రామ్‌చరణ్ సోషియా ఫాంటసీ మగధీర సినిమా చూశాక.. తనలోనూ ప్రొఫెసనల్ జెలసీ వచ్చిందంటూ వాస్తవాన్ని చెప్పారు. నటుడుగా తనకు భగత్‌సింగ్ పాత్ర కలగానే మిగిలిపోయిందంటారాయన. తెల్లదొరలపై తెలుగోడి తిరుగుబాటు ఎంత వాడిగా.. వేడిగా ఉంటుందని రుచిచూపిన తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని తెరపైకి ఎక్కించాలనుకున్నారు. సైరాగా తాను ఆ పాత్రలో నటించాలని ఎన్నో కలలుగన్నారు. కానీ.. నిర్మాతలు ఆసక్తిచూపలేదు. కమర్షియల్ నటుడుగా చిరంజీవిని తెరమీద చూసే అభిమానులు తిరస్కరిస్తారని భావించారు. పైగా గుర్రం సీనుతో యాక్ట్ చేస్తే మెగాస్టార్‌కు అచ్చిరాదనే అపనమ్మకంతో చాలా మంది నిర్మాతలు వెనక్కితగ్గారు.
కానీ తండ్రి కలను నెరవేర్చేందుకు తనయుడు చెర్రీ ముందుకువచ్చాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థతో తానే నిర్మాతగా మారాడు. పాన్ ఇండియా మూవీగా 2017 అగస్టు 16న ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. 2018 అగస్టు 20న టీజర్ రిలీజ్ చేశారు. 2019 అక్టోబరు 2న సినిమా రిలీజైంది. మెగాస్టార్ 151 సినిమాగా సైరా నరసింహారెడ్డితో థియేటర్లు హోరెత్తాయి. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో ఏకకాలంలో సినిమా విడుదల చేశారు. రూ.300 కోట్ల వ్యయంతో తీసిన సినిమా మెగాస్టార్ కల నెరవేర్చింది. స్వాంతంత్య సమరయోధుడుగా చిరును వెండితెరపై చూసిన అభిమానులకు దసరా రోజు ఆనందంతో గడచిపోయింది.
సినిమా కోసం చిరంజీవి కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారు. కూతురు సుశ్మిత డిజైనర్‌గా తన విశ్వరూపం చూపారు. తండ్రిని అంటిపెట్టుకుని.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ నిర్మాతగానే గాకుండా గొప్ప తనయుడుగా చరణ్ వ్యవహరించారు. పరచూరి సోదరుల డైలాగ్‌లు మరోసారి థియేటర్లలో మారుమోగాయి. బిగ్‌బీ అమితాబచ్చన్ సినిమాలో పారితోషికం తీసుకోకుండా నటించారు. జగపతిబాబు, విజయసేతుపతి, కిచ్చా, నయనతార, తమన్నా.. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడుగా సురేందర్‌రెడ్డి మరో మెట్టుకు ఎదిగేందుకు సైరా ఊతమిచ్చింది.
సైరా సినిమా కోసం దర్శకుడు సురేందర్‌రెడ్డి చాలా కష్టపడ్డారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి వారుసులు తరచూ చిరంజీవి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ చికాకుకు గురిచేశారు. కోటి రూపాయలు కావాలంటూ ఒకరు.. యాభై లక్షలిస్తే మేం ఒప్పుకుంటామంటూ మరొకరు ఇలా సైరాతో బేరసారాలు ఆడారు. చిరంజీవిని మానసికంగా ఇబ్బందికీ గురిచేసిన వారూ ఉన్నారు. దీన్ని అవకాశంగా మలచుకుని ప్రత్యర్థులు విషప్రచారం చేశారు. సైరా కథ తెరకెక్కటం కష్టమేనంటూ కూడా ట్రోల్ చేశారు. కానీ.. అన్ని అవాంతరాలు దాటుకుని. మెగాస్టార్ ఖ్యాతిని మరింతగా పెంచుతూ థియేటర్లు మార్మోగాయి. జైహింద్ నినాదాలు.. భరతమాతకు వందనాలతో హోరెత్తాయనే చెప్పాలి. సైరా సినిమాలో నరసింహారెడ్డిని ఉరితాడుకు వేలాడుతీసే సన్నివేశం అందర్నీ కదిలించింది. స్వాతంత్రపోరాటంతో వీరులు భరతమాత సంకెళ్లను తెంపేందుకు చేసిన ప్రాణత్యాగాలను గుర్తుచేశాయి.. అందుకే సినిమా వచ్చి ఏడాదైనా.. ఇప్పటికీ అబిమానుల గుండెల్లో సైరా గుర్తుండిపోయింది. తెలుగు జాతి ముద్దుబిడ్డగా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి ఖ్యాతి మరోసారి ప్రపంచానికి చాటినట్టయింది.
                


