ఏపీలో వైసీపీ పాలనపై భిన్నాభిప్రాయాలున్నాయి. కేవలం ఒకే వర్గానికి కొమ్మకాసేలా.. కీలకమైన పదవులు, అధికారాలు వారికే కట్టబెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణపై మీడియా సమావేశం పెట్టి మరీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఏపీలో జ్యుడిషియరీ కేవలం టీడీపీ అనుకూలంగా ఉందంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్అలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటూ.. విపక్షాలపై నమోదైన కేసులకు స్టే విధించటాన్ని కారణాలుగా చూపుతున్నారు. ఏడాదిన్నరపాటు విసిగి వేసారిన తాము సుప్రీం దృష్టికి తీసుకెళ్లామంటున్నారు. దీనికి బలం చేకూర్చేలా.. చంద్రబాబుతో సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల సంబంధాలను ఆధారంగా చూపారు. ఇవన్నీ సంచలనమైనవే. కానీ.. ఎదురుదాడి చేసేందుకు ప్రతిపక్షాలకూ అవకాశం కూడా ఉన్నాయి. కానీ జగన్‌పై ఏపీ ప్రజల్లో పెరిగిన సానుభూతి.. తరచూ కేసులు.. కోర్టులంటూ జగన్ మోహన్‌రెడ్డిని చికాకు పెడుతున్నారనే అభిప్రాయం ఇప్పుడు వైసీపీ సర్కారును కాపాడుతున్నాయి. మరో మూడేళ్ల తరువాత కూడా ఇదే సానుభూతి జనాల్లో ఉంటే.. వైసీపీను ఓడించటం ఎవరి వల్లా కాదనేది కూడా విశ్లేషకుల వాదన.
మరి ఇటువంటి సమయంలో ప్రధాన విపక్షంగా టీడీపీ ఏం చేస్తోంది. కరోనా సమయంలో పెదబాబు, చినబాబు హైదరాబాద్‌లో సురక్షితంగా ఉన్నారనే వైసీపీ ఆరోపణలకు మరింత బలం వచ్చింది. అమరావతి ఉద్యమానికి 300 రోజులు అయ్యాయంటూ లోకేష్‌బాబు సంఘీభావం చెప్పేందుకు వెళ్లటం కూడా టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. కేవలం రాజధాని రైతులను మాత్రమే సొంతం చేసుకుంటున్న చినబాబు అభిమానం మిగిలిన జిల్లా ప్రజల్లో వ్యతిరేకతను తెస్తుందంటూ కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వేలాదిమంది రైతులు రాజధాని పై నిరసన తెలిపారు. మరి దీనికి సంఘీభావంగా మిగిలిన జిల్లాల్లోని టీడీపీ కేడర్ కూడా స్పందించి ఉంటే మరింత బలం చేకూరేది. కానీ.. అటు అనంతపురం నుంచి ఇటు ఇచ్చాపురం వరకూ ఎవ్వరూ స్పందించలేదు. కనీసం రాజధాని రైతులకు సంఘీభావంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు మినహా మిగిలిన చోట్ల ఏ ఒక్క తెలుగు తమ్ముడూ స్పందించకపోవటం పార్టీను కలవరపాటుకు గురిచేసిందట.
ఇదంతా ఎందుకంటే.. భయమే కారణమంటున్నారు పుసుపుగూటి నేతలు. అదెలా అంటారా.. ఒకప్పుడు టీడీపీలో ఫైర్‌బ్రాండ్స్‌గా చెలామణీ అయి.. ప్రత్యర్థుల వెన్నులో వణకుపుట్టించిన నేతలు ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. యరపతినేని, దేవినేని వంటి ఒకరిద్దరు మినహా రాష్ట్రంలోని కీలక నేతలంతా సైలెంట్ అయ్యారు. కొందరైతే.. ఇతర రాష్ట్రాలకు చేరి వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. మళ్లీ ఎన్నికలపుడు రావచ్చనే ఆలోచనలో ఉన్నారట. వీలైతే.. వైసీపీతో మంతనాలు సాగిస్తూ అవకాశం చిక్కినపుడు పార్టీ కండువా మార్చుకుందామనే అభిప్రాయంలో పడ్డారట. పైగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య. అనంతరం మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర ,మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టులు. మాజీ మంత్రి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమా వంటి కీలక నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు కూడా టీడీపీలో కలవరపాటుకు గురిచేస్తున్నాయట. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మైనింగ్ కంపెనీల చుట్టూ కూడా వైసీపీ సర్కారు గట్టిగానే ఉచ్చు బిగించింది. నిన్నటి వరకూ గంబీరంగా కనిపించిన జేసీ దివాకర్‌రెడ్డి కూడా అయోమయంలో పడ్డారు. మైనింగ్ నిలిచిపోతే.. తన కుటుంబం తిండిలేకుండా అలమటించాల్సి వస్తుందంటూ దీనంగా మాట్లాడే పరిస్థితికి చేరారు. ఇవన్నీ సామాన్య తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. అందుకే.. వైసీపీ ప్రభుత్వంపై నిరసనలు.. వ్యతిరేకతలను ఆచితూచి మరీ ప్రదర్శిస్తున్నారట.