ఓ వైపు భారీవర్షాలు.. మరో వైపు తెగుతున్న చెరువులు. ఉప్పొంగుతున్న నాలాలు. కొట్టుకుపోతున్న జనాలు. పెరుగుతున్న కరోనా కేసులు. చుట్టూ జలం.. ఆకాశంలో మబ్బులు కనిపిస్తే ఇంట్లోకి పరుగెత్తాలనేంత భయం. ఇంతకీ ఇదంతా ఏదో మారుమూలన కాదు.. ప్రపంచచిత్రపటంలో దిగ్రేట్ చారిత్రక నగరంగా పిలిచే హైదరాబాద్ దుస్థితి. కోటి ఇరవై లక్షలకు చేరిన జనాభా.. సుమారు 60 కి.మీ విస్తీర్ణం.. 10,000 కిలోమీటర్ల మేర రహదారులు.. 30 లక్షల కుటుంబాలు. ఇంత పెద్ద నగరంలో ఇప్పుడు భూకంపాలు.. వరదలు.. భారీవర్షాలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. అసలు నగరానికి ఏమైంది. ఎన్నడూ లేనంతటి వైపరీత్యాలు ఎందుకిలా వెంటాడుతున్నాయి. ఇదంతా మానవుడు అభివృద్ధి ముసుగులో చేస్తున్న తప్పిదాలకు ప్రతిఫలమా! చేసిన తప్పునకు అనుభవిస్తున్న శిక్షలా! ఏమో. . ఏమైనా కోటి మంది జనాభా ఇప్పుడు భయంతో బతుకుతున్నారు. ఏక్షణాన భూమి పగులుతుందో.. ఆకాశం విరిగి మీదపడుతుందో తెలియక అల్లాడిపోతున్నారు. నిన్నటి వరకూ సురక్షిత నగరం అంటూ గొప్పలు పోయిన భాగ్యనగరం.. ఇప్పుడు సహజవనరులను నాశనం చేయటం వల్ల ఏర్పడిన దుష్పలితాలను అనుభవిస్తోంది. ఇప్పటికిప్పుడే ఏం కాదు.. కానీ.. మరో పది.. ఇరవై.. నలభై ఏళ్లకు హైదరాబాద్‌లో వానపడితే.. బోటులు వేసుకుని డ్యూటీలకు.. పిల్లలు బడులకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదట.
హైదరాబాద్‌లో రాజ్‌భవన్ రోడ్ అంటే తెలియని వారు ఉండరేమో. నిజమే.. అదే మార్గంలో గవర్నర్ బంగళా, కూతవేటు దూరంలో సీఎం క్యాంపు కార్యాలయాలుంటాయి. కానీ.. అక్కడ వర్షం వస్తే.. పూర్తిగా మునిగిపోతాయి. రాష్ట్రంలోనే అత్యంత లోతట్టు ప్రాంతం. పక్కనే హుస్సేన్‌సాగర్ ఉండటం వల్ల నాలాల నుంచి వచ్చే నీరు, వరదనీరు అంతా అందులోకి చేరుతుంది. కానీ క్రమంగా నాలాలూ పూడుకుపోవటం.. అభివృద్ధి చేయకపోవటంతో తరచూ వరదనీరు నిలుస్తుంది. ఇప్పటికిప్పుడు దాన్ని బాగు చేయాలంటే అయ్యే ఖర్చెంత తెలుసా.. అక్షరాలా రూ.16000 కోట్లు. కొత్తగా కేసీఆర్ సీఎం అయినపుడు అధికారులు రాజ్‌భవన్ మార్గంలో నాలాల అభివృద్ధికి ఇచ్చిన బడ్జెట్ అట. పాతికేళ్ల క్రితం దానికి రూ.300 కోట్లు బడ్జెట్ వేస్తే ఇప్పుడది తడసి మోపెడైందన్నమాట.
మరి ఇప్పుడు హైదరాబాద్‌ను వణికిస్తున్న భారీవర్షాలతో చెరువులు తెగాయి. చెరువులు, వాగులు, కాల్వలు ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకుని దర్జాగా ఉంటున్న కుటుంబాలకు పెద్ద కష్టం వచ్చిపడింది. కొందరు తెలిసి.. మరికొందరు తెలియక ఇళ్లు కట్టుకున్న తప్పిదానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. కేవలం ఇటువంటి కాలువలు, వాగుల పక్కన ఇళ్లలో ఉంటున్న వారిలో సుమారు 400000 మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 5000 వాహనాలు బురదలోనే ఉన్నాయి. జనం కూడా నాయకులపై తిరగబడుతున్నారు. ఎంతగా అంటే.. కనిపిస్తే కొట్టేంత వరకూ చేరారు. సాక్షాత్తూ కేటీఆర్‌నే జనం నిలదీశారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిని నానా తిట్లు తిట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కారును అడ్డుకున్నారు. ఇప్పుడు హయత్ నగర్ కార్పొరేటర్ తిరుమలరెడ్డిని కాలనీ వాసులు కొట్టారట. అసలే గ్రేటర్ ఎన్నికల్లో 110 సీట్లు గ్యారంటీ అంటూ కేటీఆర్ ప్రకటించారు. ఈ క్షణంలో ఎన్నికలు జరిగినా మేయర్ పీఠం కారుదేనంటూ తేల్చిచెప్పారు. ఇప్పుడున్న వరదల పరిస్థితుల్లో జనం తిరగబడుతున్నారు. ఇదే వ్యతిరేకతగా మారితే.. కారు గేరు మారినట్టే.