పిల్లలు దేవుళ్లతో సమానం. కల్మషం లేని నవ్వుల్లో అన్నీ మరచిపోవచ్చు. ఎంత అలసటగా అనిపించినా చిన్నారి పాదాలు తాకిచూడండీ.. ఒక్కసారి మీ ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. ఎంత కోపంలో ఉన్నా.. ఒక్క చిట్టితల్లి బోసినవ్వును ఆస్వాదించండీ మీ ముఖంపై నవ్వు ఇట్టే చేరుతుంది.. ఇది నా మాట కాదండోయ్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైకాలజిస్టులు, మానసిక పరిశోధకుల మాట. మరి అటువంటి పిల్లవాడిని దెబ్బకొట్టాలంటే పదిసార్లు ఆలోచిస్తాం.. అటువంటిది.. డబ్బుకోసం ప్రాణాలు తీసేంత కసాయిగా మారాడంటే వాడిని ఏమనుకుకోవాలి. రాక్షసులు కూడా భయపడే ఈ మృగాన్ని మహబూబాబాద్‌లో సాగర్ అన్నారు. పనికల్పించిన యజమాని కొడుకును కడతేర్చాడు. దారుణంగా చంపేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సాగర్ దుర్బుద్ది.. అతడి నేర స్వభావం గురించి ఆధారాలు సేకరించిన పోలీసులు సైతం ఉలికిపాటుకు గురయ్యారు. ఇటువంటి మృగాలు ఇంకెన్ని మన ఇంటిచుట్టూ తిరుగుతున్నాయనే ఆందోళన కలిగించారు.
అక్టోబరు 18న దీక్షిత్‌రెడ్డి అనే తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసినట్టు అగంతకులు ఫోన్ చేశారు. ఇంటర్నెట్ ఫోన్‌కాల్స్ ద్వారా ఎవరికి దొరకకుండా కొండల్లో దాక్కుని నాటకమాడారు. చివరకు ఆ పిల్లాడిని చంపేసి రూ.40లక్షలు కావాలంటే పిల్లాడి తల్లిదండ్రులను డిమాండ్ చేశారు. చివరకు పోలీసులకు చిక్కారు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. సాగర్ అనే నిందితుడు బాలుడిని చంపేశాడు. నిజానికి ఆ పిల్లవాడిని కిడ్నాప్ చేసి పెద్ద ఎత్తున డబ్బు లాగాలనేది సాగర్ ఎత్తుగడ. అందుకే.. తనకు తెలిసిన దీక్షిత్‌రెడ్డిని పెట్రోల్ బంక్ వద్దకు వెళ్దామంటూ పిలిచి బైక్ ఎక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లాక.. మంచినీళ్లలో నిద్రమాత్రలు కలిపి పిల్లవాడికి ఇచ్చాడు.
దీక్షిత్ రెడ్డి సృహలోకి రాక ముందుగానే గొంతునులిమి చంపేశాడు. ఆనవాళ్లు చిక్కకుండా పెట్రోల్ బంకులో కొన్న పెట్రోల్‌తో మృతదేహాన్ని కాల్చాడు. ఏమీ ఎరగనట్టుగానే దీక్షిత్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. అక్కడ పరిస్థితిని గమనించాడు. మరోసారి యాప్ సాయంతో ఫోన్‌కాల్ చేసి 40 లక్షలరూపాయలు డిమాండ్ చేశాడు. వాటిని వీడియోకాల్‌లో చూపాలన్నాడు. ఇదంతా ఒక షాపులో ఉంటూ గమనించాడు. డబ్బు చేతికి వచ్చే సమయంలో పోలీసులు కూడా ఉన్నారనే అనుమానంతో మకాం మార్చాడు. ఏడాది కాలంగా గర్ల్‌ఫ్రెండ్‌తో కూడా ఇదే యాప్ ద్వారా మాట్లాడుతున్నట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. డబ్బు కోసం పసిపిల్లవాడిని చంపిన మృగాన్ని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు గ్రామ ప్రజలు. అమాయకంగా నమ్మి వెళ్లినందుకు ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లవాడి ఘటన అందర్నీ కదిలించింది. బిడ్డ కోసం ఎంతగా ఎదురుచూసిందో.. డబ్బు.. నగలు అన్నీ ఇస్తానన్నా.. నా బిడ్డను నాకివ్వంటూ కిడ్నాపర్లను ఎంతగా ప్రాధేయపడిందో ఆ కన్నతల్లి. చివరి చూపు లేకుండా బిడ్డ నిప్పుల్లో మసిగా మారటాన్ని తట్టుకోలేకపోయింది. కొడుకుపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ కన్నతల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తోంది.
తొమ్మిదేళ్ల పిల్లాడు దీక్షిత్‌లు మన ఇంట్లోనూ ఉన్నారు. సాగర్ వంటి మృగాలు మన చుట్టూ తచ్చాడుతూనే ఉంటాయి. కాబట్టి.. పిల్లలను ఓ కంట గమనించండి. ప్రతి పిల్లాడికి చెప్పండి.. తెలిసిన వాళ్లైనా.. బయటకు వెళ్దామని పిలిస్తే వెళ్లొద్దని గట్టిగా చెప్పండి. ఎక్కడకు వెళ్లినా.. అమ్మనాన్నలకు ఒక్కమాట చెప్పమని సూచించండీ. ఆపద వచ్చినపుడు ఎలా తప్పుకోవాలనేది కూడా నేర్పించండీ అంటున్నారు విద్యానిపుణులు.



