పోల‌వ‌రం గేమ్‌లో.. టీడీపీ , వైసీపీ సేమ్ టు సేమ్‌??

పోల‌వ‌రం ఆంధ్ర్రప్ర‌దేశ్ జ‌ల‌నాడి. ఏళ్ల‌త‌ర‌బ‌డి వాయిదాలు ప‌డుతూ వ‌స్తున్న ప్రాజెక్ట్‌. తాగు, సాగునీటి అవ‌స‌రాల తీర్చే అద్భు త‌మైన వ‌న‌రు. వైఎస్ సీఎం అయ్యాక దానికి పునాది మ‌రోసారి వేసినా.. చంద్ర‌బాబు హ‌యాంలో కాస్త వేగం పుంజుకుంది. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీకు సీఎం అయిన చంద్ర‌బాబు.. రెండుక‌ళ్ల సిద్ధాంతంతో అమ‌రావ‌తి, పోల‌వ‌రం రెండింటిని తానే నిర్మించి జాతినేత‌గా ఎద‌గాల‌ని త‌ప‌న‌ప‌డ్డారు. కానీ.. చుట్టూ మూగిన మందిమాగ‌దులు.. కాంట్రాక్ట‌ర్ల ఉచ్చులో చిక్కారు. ఐదేళ్ల కాలంలో రెండింట్లో ఏదీ పూర్తిచేయ‌లేక‌.. ఓట‌మితో బ‌య‌ట‌కు వెళ్లారు. ఆ రెండు పూర్తి చేసేందుకు ఐదేళ్ల కాలం చాల‌దా! అంటే అదేం కాదు.. మ‌ళ్లీ ఐదేళ్ల కోసం వాటిని అత్తెస‌రుగా వ‌దిలేయ‌టం రాజ‌నీతిగా టీడీపీ శ్రేణులు తెగ జ‌బ్బ‌లు చ‌ర‌చుకుంటాయి. ఆ నాడు మంత్రి దేవినేని ఉమామహేశ్వ‌ర‌రావు అయితే ఓ అడుగు ముందుకేసి.. 2018 నాటికే పోల‌వ‌రం పూర్తిచేస్తామంటూ మీసం మెలేసి మ‌రీ తొడ‌గొట్టారు. ఇది గ‌తం..

ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది.. ప్రాజెక్టుల‌ను రీ టెండ‌రింగ్ అంటూ.. పాత కాంట్రాక్ట‌ర్ల‌ను వ‌దిలించుకుని అయిన‌వారికి అప్ప నంగా ప‌నులు అప్ప‌గిస్తూ.. చూశారా.. మేం రాష్ట్ర ఖ‌జానాకు ఎంత ఆదాయం తెస్తున్నామో.. వృధాను ఎంత ఆపుతున్నా మోనంటూ తెగ త‌బ్బిబ్బ‌వుతోంది. పోల‌వ‌రం నిర్మాణం సైలెంట్‌గా పూర్తిచేస్తున్నామంటుంది. అది నిజ‌మే అయితే.. ఏపీలోని
5 కోట్ల ప్ర‌జ‌లంత అదృష్ట‌వంతులు మ‌రెవ‌రూ ఉండ‌రు. కానీ.. అక్క‌డే అస‌లు పిత‌లాట‌కం వ‌చ్చింది. పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నా విలువ రూ.50వేల కోట్లు. కానీ.. టీడీపీ చీక‌టి ఒప్పందాల‌తో అది కాస్తా.. రూ.20వేల కోట్ల‌కు త‌గ్గింది. ఇప్పుడు పోల‌వ‌రం కోసం తాము 2013-14లో నిర్ణ‌యించిన నిధుల‌ను మాత్ర‌మే ఇస్తానంటూ ఇటీవ‌ల మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గ‌నకు తేల్చిచెప్పారు. అంటే ఆ లెక్క‌న కేవ‌లం రూ.7000 కోట్ల చేతిలో పెట్టి మీ పోల‌వ‌రంలో మా పాత్ర పూర్త‌యిందంటూ చేతులు దులుపుకుంటార‌న్న‌మ‌ట‌. ఈ లెక్క‌న ఏపీ ప్ర‌బుత్వం పోల‌వ‌రం పూర్తిచేయ‌టానికి అద‌నంగా రూ.27 వేల కోట్లు భార ప‌డుతుంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి.

దీంతో సీఎం జ‌గ‌న్ సాగునీరు, ఆర్ధిక శాఖ‌ల ముఖ్య కార్య‌ద‌ర్శుల‌ను ఢిల్లీ పంప‌నున్నారు. తానే స్వ‌యంగా పీఎం న‌రేంద్ర‌మోదీకు లేఖ రాయ‌నున్నారు. అదీ కుద‌ర‌క‌పోతే తానే స్వ‌యంగా పీఎంతో మాట్లాడాల‌నే ప్లాన్‌లో ఉన్నార‌ట‌. అయితే.. పోల‌వ‌రం చుట్టూ జ‌రుగుతున్న రాజ‌కీయ గేమ్‌లో త‌ప్పంతా వైసీపీదేనంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఆ నాడు టీడీపీ ప్ర‌భుత్వం పోల‌వ‌రం నిర్మాణం కోసం రూ.50వేల కోట్లు కావాల‌ని కేంద్రాన్ని అడిగితే.. అబ్బే అంత ఇవ్వొద్దంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్ కేంద్రానికి లేఖ‌లు రాసి నిదులు రాకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తుంది. వైసీపీ మాత్రం ఇదంతా 2016 లో ప్యాకేజీ కోసం చంద్ర‌బాబు చేసిన పెద్ద త‌ప్పిద‌మంటూ మంత్రి అనిల్‌కుమార్ ఆధారాల‌తో స‌హా మీడియా ముందు వ‌చ్చారు. 2014కు ముందు కేంద్రం పోల‌వ‌రం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించింది. నిర్మాణం తామే పూర్తిచేస్తామంటూ స్ప‌ష్టంచేసింది. కానీ.. చంద్ర‌బాబు మాత్రం త‌న వారి కోసం తామే నిర్మాణం చేస్తామంటూ కేంద్రానికి హామినిచ్చారంటూ మంత్రి అనిల్ ఆ నాడు చంద్ర‌బాబు కేంద్రానికి రాసిన లేఖ‌ను చూపారు. 2017 నాటికే తాము 53 శాతం నిర్మాణం కేవ‌లం రూ.8000 కోట్ల‌తో పూర్తిచేశామంటూ చంద్ర‌బాబు కేంద్రానికి చెప్ప‌టం వెనుక ఆంత‌ర్యం ఏమిట‌నేది కూడా ప్ర‌శ్నించారు. ఈ లెక్క‌న‌.. పోల‌వ‌రం నిర్మాణానికి రూ.20వేల కోట్లు చాల‌నే సంకేతాలు.. సంత‌కాలు చేశారంటూ ఎద్దేవాచేశారు. ఇలా.. వైసీపీ, టీడీపీ ఆడుతున్న పోలిటిక‌ల్ గేమ్‌లో పావులుగా మారింది మాత్రం ఏపీలోని ఐదు కోట్ల ప్ర‌జ‌లే అనేది ఇప్పుడిపుడే జ‌నాల‌కు అర్ధ‌మ‌వుతున్న నిజం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here