ఉద్యోగావకాశాలు కోల్పోవడం, భౌతికంగా కదలికలు తగ్గడం లాంటి అనేక కారణాల వల్ల మానసిక కుంగుబాటు
హైదరాబాద్, నవంబర్ 3, 2020: ఉద్యోగావకాశాలు కోల్పోవడం, ఒకరిని ఒకరు కలిసే అవకాశాలు లేకుండా భౌతిక కదలికలపై పరిమితులు.. తదితర కారణాల వల్ల కొవిడ్-19 సమయంలో చాలామంది ఒకరకమైన మానసిక కుంగుబాటులోకి వెళ్లిపోతున్నారు. భారతీయుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి ఏదో రకమైన కుంగుబాటు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనివల్ల రాబోయే కాలంలో ఇవి కాస్తా మరింత ఎక్కువైతే ఆత్మహత్య లక్షణాలు కూడా పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
నవంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఉన్న వారం రోజులను అంతర్జాతీయ ఒత్తిడి అవగాహన వారంగా జరుపుకొంటారు. కుంగుబాటుపై తగిన చర్చ జరిగేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపడతారు. మానసిక కుంగుబాటు అనేది ప్రపంచంలో ఇతర ఏ రకమైన వ్యాధులన్నింటి కంటే మరింత దారుణమైనది. దీని దుష్ప్రభావాలు ప్రపంచం నలుమూలలా నానాటికీ పెరుగుతున్నాయి. భారతదేశం సహా దాదాపు అన్ని దేశాల్లో కొవిడ్ పరిస్థితి దారుణంగా తయారైంది. దేశవాసుల్లో ఒక విశ్వాసం, నమ్మకం పెంపొందేలా చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కలసికట్టుగా కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ పరిస్థితిపై మెడికవర్ ఆసుపత్రుల సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్టు డాక్టర్ రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ, “నేను కలిసిన, చికిత్స చేసిన వారిలో కుంగుబాటు, దానికి సంబంధించిన ఇతర సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఉద్యోగాలు కోల్పోవడం, కొత్తవి దొరక్కపోవడం, లాక్‌డౌన్ సమయంలో శరీర బరువు పెరగడం, కరోనా వైరస్ ప్రత్యక్ష ప్రభావం మెదడులోని కొన్ని రసాయనాలపై పడటం వల్ల వాటి సమతుల్యత తగ్గుతోంది. ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. వీటన్నింటివల్ల కుంగుబాటు పెరుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం, వ్యాపార వర్గాలు, వైద్యనిపుణులు, పౌరసమాజం అందరూ కలిసి ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే భారతదేశం పెద్ద విపత్తులో పడుతుంది, దానివల్ల ప్రజల ఉత్పాదకతపైనా ప్రభావం పడుతుంది” అన్నారు.
“దేశంలో మొత్తమ్మీద పరిస్థితిని కొంతవరకు సరిదిద్దే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నా, ప్రజల ఉత్పాదకతకు, వ్యాపార ప్రయోజనాలకు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే వ్యాపార వేత్తలు, ఇతర వర్గాలు కలిసి ప్రజలు కుంగుబాటు నుంచి బయటకు వచ్చేలా చేసేందుకు వ్యూహాలు రచించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేసేలా ప్రోత్సహించడం దగ్గర నుంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా చేయడం లాంటి చర్యలతో ప్రజలను ఒత్తిడి, కుంగుబాటు నుంచి బయటకు తీసుకురావచ్చు” అని డాక్టర్ రాహుల్ అగర్వాల్ వివరించారు.
ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన లాంటి పరిస్థితులను అధిగమించడంపై వ్యవస్థలన్నీ కలిసికట్టుగా.. జీవనశైలి, ఒత్తిడి నివారణకు కృషిచేయాలి. వైద్యనిపుణులు, సాంకేతిక వృత్తినిపుణులు, ప్రజాసేవకులు.. వీళ్లందరిపై ఇతర వర్గాల కన్నా ఇంకా చాలా ఎక్కువ ఒత్తిడి ఉంది. అందువల్ల సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సిన బాధ్యత సంస్థలపై ఉంది.