నటుడు ప్రకాశ్‌రాజ్.. ఎప్పుడూ వివాదాల చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఒకవేళ ఏమీ లేకపోయినా పనిగట్టుకుని మరీ వాటిని ఆహ్వానిస్తుంటాడనే భావన లేకపోలేదు. తెలుగు సినిమాల నుంచి కొద్దికాలం వేటుకూ గురయ్యాడు. జాతీయ రాజకీయాలపై తరచూ ఏవో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. ఎన్డీఏ సర్కారులో ప్రజల్లో అసహనం పెరిగిందంటూ అప్పట్లో ఏవో మాట్లాడారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తెలుగు టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మరోసారి బీజేపీపై తన అక్కసు వెళ్లగక్కారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గురించి కూడా నాలుగు విమర్శలు చేశారు. అసలు తనకు జాతీయ పార్టీలే నచ్చలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ దేశానికి అవసరం లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్‌వంటి పాలకుడు ఎప్పటికీ దొరకడన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత. స్వతంత్రంగా ఉండాల్సిన నాయకుడుబీజేపీ నాయకత్వం కింద పనిచేయటాన్ని తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు లేకుండా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే బావుండేదన్నారు. పవన్ వంటి నాయకుడు స్థిరత్వం లేకుండా ఉండటంపై ఆవేదన వెలిబుచ్చారు. 2014 ఎన్నికల్లో బీజేపీను పొగిడారు. 2019లో అదే బీజేపీను తిట్టిన పవన్ కళ్యాణ్ అదే పార్టీతో దోస్తీ చేయటంపై విమర్శలు గుప్పించారు. నాయకుడుగా పవన్‌కు స్థిరత్వం లేకపోతే ఎలా అన్నారు. నిత్యం ఏదోఒక వివాదంలో తలదూర్చుతూ చికాకులు కొనితెచ్చుకునే ప్రకాశ్‌రాజ్‌కు ఈ సారి పవర్‌స్టార్ అభిమానుల నుంచి ఎలాంటి స్పందన ఎదురవుతుందో చూడాల్సిందే.