తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీపై క్లారిటీ ఇచ్చారు. ఇన్నేళ్లుగా దోబూచులాడుతు వస్తున్న కొత్త రాజకీయపార్టీపై ఎట్టకేలకు నోరు విప్పారు. ట్వీట్టర్ వేదికగా అభిమానులను ఖుషీచేసేలా ట్వీట్ చేశారు. రజనీకాంత్ పార్టీ పెడతానంటూ ప్రకటించారు. డిసెంబరు 31న పార్టీ పేరు ప్రకటిస్తానన్నారు. వివరాలను మాత్రం 2021 జనవరి 1న అంటే కొత్త ఏడాది రోజు వెల్లడిస్తానన్నారు. రెండ్రోజుల క్రితమే రజనీ తన అభిమానులతో సమావేశమయ్యారు. బీజేపీతో దోస్తీ చేస్తే తాము ఒప్పుకోమంటూ కూడా ఫ్యాన్స్ స్పష్టంచేశారు. దీంతో అభిమానుల అనుమానాలను పటాపంచలు చేస్తూ పార్టీపై ప్రకటన వెల్లడించారు. 2021 ఎన్నికల్లో పోటీచేయటం ఖాయమంటూ చెప్పారు. అయితే.. 21 రోజుల తరువాత తాము పెట్టబోయే ప్రాంతీయపార్టీ, గుర్తు, విధివిధానాలపై స్పష్టత రానున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి రజనీకాంత్ కొత్తపార్టీపై 1996లోనే ఊహాగానాలు వచ్చాయి. అయితే అప్పటికే రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత హవా నడుస్తోంది. ప్రస్తుతం వారిద్దరూ మరణించటంతో కొత్త పార్టీకు అవకాశం వచ్చినట్టయింది. దీంతో రజనీకాంత్ పార్టీపెడతారనే ఊహాగానాలకు మరింత బలం పెరిగింది.
2017లోనే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ మూడేళ్ల పాటు ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రజనీకాంత్ ప్రకటనతో ప్రధానపార్టీలన్నీ ఉలికిపాటుకు గురయ్యాయి. బీజేపీ కూడా షాక్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దేవుడు ఆదేశించాడంటూ చేసిన ట్వీట్‌తో ఇప్పుడు తమిళనాట రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరి ఎన్నికల్లో రజనీ ఎవరితో పొత్తు పెట్టుకుంటారు. లేకపోతే ఒంటరిగానే బరిలోకి దిగుతారా అనేది తెలియాంటే జనవరి 1 వరకూ ఆగాల్సిందే. ఫ్యాన్స్ మాటలకే తలొగ్గిన రజనీకాంత్‌కు ఇప్పటికే వారి నుంచి పూర్తి మద్దతు కనిపిస్తోంది. రెండ్రజుల క్రితం ముఖ్య నేతలతో సమీక్షించిన రజనీకాంత్ కూడా వారి సూచనలు తీసుకున్నారు. పార్టీ అడుగులు వేయటంలోనూ వారి సలహాలే కీలకమంటూ పిలుపునిచ్చారు. జయలలిత, రామచంద్రన్, కరుణానిధి తరువాత అంతగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్. వివాదాలకు దూరంగా ఉండే ఆయన పార్టీతో ముందుకు రావటం.. డీఎంకే, అన్నాడీఎంకేపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.