హమ్మయ్య.. చావు తప్పి కన్నులొట్టబోయింది. ఇక మేయర్ ఎంపికే మిగిలింది. రెండోసారి కూడా మాదే పెత్తనం అనుకున్న అధికార టీఆర్ ఎస్‌కు ఝలక్ ఇచ్చారు నగర ప్రజలు. అసలు బీజేపీతో మాకు పోటీయే కాదనుకున్న కేటీఆర్‌కు షాకిచ్చారు. ఎంఐఎం కూడా సీట్లు. ఓట్లు పెంచుకున్నా.. బీజేపీతో మున్ముందు ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందనే ఆందోళనలో ఉంది. అందుకే.. మేం కూడా హిందువులకు సీట్లు ఇచ్చి గెలిపించాం. అయినా ఎంఐఎం అంటే ముస్లింల పార్టీ అని ఎందుకింత దుష్ప్రచారం చేస్తున్నారంటూ పాపం అసదుద్దీన్ తెగ ఫీలయ్యారు. కేటీఆర్ కూడా ఏం చేస్తాం.. సీట్లు పోనాయి మరీ అన్నట్టుగా స్పందించారు. బీజేపీ మేం ఏం తక్కువ తిన్లేదు.. రేపటి నుంచి బల్దియా నుంచి తెలంగాణ వరకూ ఎలా గెలవాలనేది పక్కా స్కెచ్ వేశామంటోంది. నిజానికి ఇది ఎవరి గెలుపు.. ఏ పార్టీ ఓటమి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే… ఓటర్లు చాలా తెలివిగా వ్యవహరిస్తారు.
అందరూ అనుకున్నట్టుగా. మందుబాటిళ్లు.. డబ్బులు.. బహుమతులు ఇవన్నీ ఓటర్లను లొంగదీస్తాయనేది నిజం కాదు. ఆర్ధిక ఇబ్బందులు.. కుటుంబం అవససరాలు ఓటర్లను చేతులు చాపేలా చేసినా.. మనసులో మాత్రం తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఎవరిని గెలిపించాలి.. ఎవరికి బుద్ది చెప్పాలనేది దాగే ఉంటుంది. దీన్నే మాబ్ సైకాలజీ అంటారు. ఒక ప్రాంత ప్రజల్లో ఒకే తరహా ఆలోచనలకు అదే కారణం. మౌత్‌టాక్ ద్వారా ఇది ఎక్కువగా జరుగుతుంది. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ అదే జరిగింది. రెండుసార్లు గెలిచిన టీఆర్ ఎస్ అధికారంతో ఇష్టానుసారం చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో టీఆర్ ఎస్ పట్ల వ్యతిరేకత కారణమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేవలం బుద్ద విగ్రహాలుగా పరిమితమయ్యారనే భావన కూడా ప్రజల్లో నెలకొంది. ఏదో విధంగా ఒక్కసారి టీఆర్ ఎస్‌కు ఓటమి రుచి చూపటం ద్వారా నెత్తికి ఎక్కిన కళ్లను కిందకు దించాలని ఆలోచించారు. అందుకే.. బీజేపీ మీద ప్రేమ కంటే కూడా టీఆర్ ఎస్ మీద కోపమే తెలంగాణ రాష్ట్ర సమితి సీట్లకు ఎసరు పెట్టింది. ఇది ఎవరు కాదన్నా.. ఔనన్నా గ్రౌండ్ లెవల్లో జరిగిన వాస్తవం. 99 సీట్ల నుంచి ఇప్పుడు.. ఎవరో ఒకరు సపోర్టు చేస్తే కానీ మేయర్ పీఠం ఎక్కలేని దుస్ధితికి చేరింది. ఇది కేవలం టీఆర్ ఎస్‌కు మాత్రమే కాదు.. ప్రజాబీష్టాన్ని కాదని.. పెత్తనం చెలాయిస్తే.. ఏ పార్టీ అయినా ఇదే ఫలితం చవిచూడాల్సి వస్తుందని విజ్ఞతతో గ్రేటర్ ఓటరు ఇచ్చిన అసలు సిసలైన సందేశం.