మీరు చదివింది నిజమే.. ఎంత మెగాస్టార్ అయినా తనకూ ఎమోషన్స్ ఉంటాయంటారు చిరంజీవి. ఆహా వేదికగా సమంతతో జరిపిన ఇంటర్వ్యూలో చిరంజీవి కొత్త విషయాలు చాలా పంచుకున్నారు. వాటిలో తన కెరీర్.. విజయం.. కుటుంబంతో అనుబంధం.. సినిమాల్లో తనకెదురైన సంఘటనలను వివరించారు. తాను కూడా ఏడ్చిన సంఘటనలు చాలా ఉన్నాయంటూ ఎటువంటి బేషజాల్లేకుండా వాస్తవాలు వెల్లడించారు. శంకరాభరణం సినిమా ఆఖరి సన్నివేశం చూసి తాను చాలా ఏడ్చానన్నారు. ఆ సినిమాలో నటించిన మంజుభార్గవితో తాను కోతలరాయుడు సినిమాలో నటించానంటూ.. ఆ సినిమా కోసం ప్రత్యేక షోలో అందరూ చూసేందుకు వెళ్లారట. ఆ సమయంలో దర్శకుడు కె.విశ్వనాథ్‌తో పరిచయం లేదు. చివరి సీన్లో జేవీసోమయాజుల నటన చూశాక కన్నీళ్లు ఆగలేకపోయాయట. జేబులో కర్చీఫ్ లేకపోవటంతో పక్కనే కూర్చున్న మంజుబార్గవి చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకున్నారట. ఆ సమయంలోనే ఒక్కసారిగా లైట్లు వెలగటంతో.. అందరూ తన వైపే చూశారంటూ గుర్తు చేశారు. ఆ సినిమా చూసేందుకు అల్లురామలింగయ్యతోపాటు.. సురేఖ కూడా వచ్చిందన్నారు. అప్పట్లో ఆ సంఘటన చూడకపోవటంతోనే తనను పెళ్లి చేసుకుని ఉంటుందంటూ చమత్కరించారు.
ఆ సినిమా తరువాత రెండోసారి వేట సినిమా అట్టర్‌ప్లాప్ కావటంతో ఏడ్చానన్నారు. ఖైదీ తరువాత అదే బేనర్‌పై వచ్చిన ఆ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నట్టు చెప్పారు. కానీ ఆ సినిమా ఘోరంగా దెబ్బతినటంతో ఏడ్చినట్టు అంగీకరించారు. ఆ తరువాత పలు ప్లాప్‌లు వచ్చినా.. పరిణితి చెందాక సక్సెస్‌తో సమానంగా చూడటం అలవడిందన్నారు. విజేత సినిమా ఇప్పుడు చూసినా కన్నీరు ఆగదంటూ సమంతతో తాను కన్నీరు పెట్టుకున్న సంఘటనలను వివరించారు.



