వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన ఉంది. ఏడాదిన్నర పాలనపై పెద్దగా వ్యతిరేకత లేదు. అయినా వైసీపీ లో అంతర్గత కలహాలు గుబులు పుట్టిస్తున్నాయి. మున్ముందు పార్టీను మరింత దిగజార్చేలా నేతలు నడచుకుంటున్న తీరు కూడా ఒకింత అసహనానికి కారణమవుతోందట. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నడచిన దారిలోనే తమ అధినేత జగన్ కూడా అడుగులు వేయటమే దీనికి కారణమంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారట. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే… ఇప్పటికే బాపట్ల ఎంపీ వర్సెస్ తాడికొండ ఎమ్మెల్యే గొడవ చాపకిందనీరులా ఉంది. గన్నవరంలో యార్లగడ్డకు కొడాలికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. శ్రీకాకుళం జిల్లాలోనూ ధర్మానపై సోదరుల మధ్య అంతర్గత విబేధాలు నడుస్తున్నాయి. విశాఖలో అవంతి శ్రీనివాస్ , గంటా మధ్య గొడవతో వైసీపీను ఇరుకున పెడుతుందట.
వీటిని కొద్దిసేపు పక్కనబెడితే ప్రకాశం జిల్లా చీరాలలో కరణం బలరాం మధ్య రామన్నపేట పంచాయతీ గొడవ తారాస్థాయికి చేరిందట. ఇటీవలే గంగపుత్రుల మధ్య ఇద్దరు నేతలు..అనుచరుల మధ్య ఘర్షణ పార్టీలో విబేధాలను మరింత పెంచింది. ఎంపీ మోపిదేవి వెంకటరమణ పర్యటనలోనే ఇరువర్గాలు ముఖాముఖీ తలపడ్డాయి. ఇప్పుడు ఇద్దరి గొడవ పంచాయతీ ఎన్నికల్లో ఎంత వరకూ దారితీస్తుందనేది పార్టీ వర్గాల ఆందోళనగా తెలుస్తోంది. కరణం బలరాం.. టీడీపీ కీలక నేత. అయితే చంద్రబాబుతో సఖ్యత లేని కారణంగా ఇమడలేకపోతున్నాడనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వారసుడి రాజకీయభవితవ్యం కోసం పార్టీ మారాలని నిర్ణయించుకున్నా.. రాజీనామా చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో పార్టీ కండువా కప్పుకోకున్నా.. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేగా వంశీ బాటలోనే నడిచారు. దీంతో కరణం బలరాం ప్రాభల్యం పెరగటంతో.. వైసీపీ శ్రేణులతోపాటు.. ఆమంచి కృష్ణమోహన్‌కు ఇబ్బందిగా మారింది. కొద్దిరోజుల క్రితమే జ్యుడిషియల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ముఖ్యంగా హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా మాట్లాడిన ఆమంచికి సీబీఐ నోటీసులు జారీచేసింది. తాను ఇంతగా పార్టీ పల్ల నిబద్ధతగా ఉంటే.. కరణం బలరాంకు పెత్తనం ఇచ్చి తనను తక్కువ చేయటాన్ని ఆమంచి భరించలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు నేతల మధ్య విబేధాలే గాకుండా.. రెండు ప్రధాన సామాజికవర్గాలు కూడా కలసి పనిచేసే అవకాశం లేదనే వార్తలు వస్తున్నాయి.