ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన రంగన్న.. అలియాస్ రంగయ్య. రాజకీయంగా సంచలనంగా మారాడు. కడప జిల్లా పులివెందులలో తిరుగులేని వైఎస్ కుటుంబంలో జరిగిన హత్యకు తానే సాక్ష్యమంటూ ఏకంగా న్యాయ మూర్తి వద్ద వాంగ్మూలం ఇచ్చాడు. అప్రూవర్‌గా మారి వివేకా మర్డర్ మిస్టరీ గుట్టు బయటపెట్టాడు. 15 మంది వ్యక్తులు… రూ.8కోట్ల సుపారీ.. వారిలో ఇద్దరు ప్రముఖులున్నారంటూ బాంబు పేల్చాడు. ఇటువంటి సమయంలోనే తనను అరెస్ట్ చేయవద్దని.. రంగయ్య ఇచ్చిన సాక్ష్యంతో సునీల్‌కుమార్ యాదవ్ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మరి మరో వ్యక్తి ఎవరనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఆ వ్యక్తి వివేకా కుటుంబానికి చెందిన ముఖ్యమైన నాయకుడుగా ప్రచారం జరుగుతుంది. అందరూ అనుకున్నట్టుగా ఇందులో రాజకీయ కుట్రలేదని.. కుటుంబంలోని అంశాలు.. కొన్ని సంఘటనలు వివేకా మర్డర్‌కు దారితీశాయనేది తెలుస్తోంది.
2019 ఎన్నికలకు ముందు మాజీ ఎంపీ వివేకా మర్డర్ జరిగింది. ఇది టీడీపీ కుట్ర అంటూ వైసీపీ.. అబ్బే కాదు.. రాజకీయంగా దెబ్బతీసేందుకు వైసీపీ ఆడుతున్న డ్రామా అని సానుభూతితో ఓట్ల కోసం వారే చేయించారంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అప్పట్లో పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారిపై కూడా ఆ నాడు కొందరు నేతలు ఒత్తిడి తెచ్చారని.. అయితే ఆయన ముక్కుసూటిగా నిజాయతీగా ఉండటం వల్ల ప్రత్యర్థులను కేసులో ఇరికించలేకపోయారనే ప్రచారం ఉంది. ఆ తరువాత ఆ అధికారిని బదిలీ చేశారు. అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ కూడా కేసు విషయంలో చూసీచూడనట్టుగా ఉండటంతో మళ్లీ కోర్టు జోక్యంతో కేసు సీబీఐ వేగవంతం చేసింది. దాదాపు 200 మందిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలోనే ఇద్దరు అనుమానితులు ఊహించని విధంగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలంతో మళ్లీ రాజకీయ పక్షాల్లో చర్చ మొదలైంది. ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరనేది కూడా ఆసక్తిగా మారింది. ఒకవేళ ఈ కేసులో వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు తేలితే.. టీడీపీ ఆరోపణలకు బలం చేకూర్చినట్టవుతుంది. రాజకీయంగా కూడా వైసీపీకు మైనస్‌గా మారే అవకాశం లేకపోలేదు. అదే ఈ మర్డర్ కేవలం కుటుంబ కక్షలతో జరిగినట్టు రుజువైతే టీడీపీ ఆత్మరక్షణలో పడటమే కాదు.. రాజకీయంగా రాయలసీమ జిల్లాల్లో ఊహించని షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందనేది విశ్లేషకుల అంచనా. ఏమైనా.. ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరనేది తేలేంత వరకూ తెలుగు నాట ఉత్కంఠ తప్పదేమో!