ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్‌పై సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. దాదాపు వారం రోజులుగా పులివెందులలో మకాం వేసిన సీబీఐ అధికారుల బృందం.. సీఐ శంకరయ్యతోపాటు 100 మందిని ప్రశ్నించింది. తాజాగా వివేకా కూతురు సునీత నుంచి కూడా కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. హత్యలో అనుమానితుల జాబితాలో ఎంపీ అవినాష్ రెడ్డితో సహా.. వైఎస్ కుటుంబీకులు 10 మంది వరకూ ఉన్నారు. వీరందరినీ సీబీఐ ప్రశ్నించనుందని సమాచారం. టీడీపీ అధికారంలో ఉన్నపుడు జరిగిన హత్య.. వైసీపీ అధికారం చేపట్టిన తరువాత ఏడాదిన్నరపాటు ఎటూ తేల్చలేకపోయారు. కనీసం హత్యకు కారణాలను కూడా గుర్తించలేకపోయారు. స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగినా ఏ మాత్రం క్లూ కూడా సంపాదించలేకపోవటం ఖాకీ ప్రతిష్ఠకు సవాల్‌గా మారిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. మరి… అసలు నిందితులను పట్టుకుంటుందా! హత్యకు దారితీసిన పరిస్థితులను గుర్తిస్తుందా! అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎన్నో కీలకమైన కేసులను చేధించిన సీబీఐకు వివేకా మర్డర్ కేసు సవాల్‌గా మారటం కొసమెరుపు. అయినా తేలికగానే కేసు వెనుక అసలు గుట్టు వెలికితీస్తామనేది సీబీఐ కాన్ఫిడెన్స్.