ఎక్కడైనా.. వేలు.. లక్షలు.. ఇతడేంట్రా.. కోట్లకు కోట్లు లంచాలు మింగాడు. రెండుకోట్లరూపాయల కావాలని డిమాండ్ చేయటమే కాదు.. పూర్తి క్యాష్ కూడా రప్పించుకున్నాడు.. ఇదంతా కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు గురించి అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ)లో చర్చ. ఎంత గుండెలు తీసిన బంటు గాకపోతే.. అంతంత డబ్బులు అడుగుతాడు.. నాగరాజు అవినీతి సాధారణమైంది కాదండోయ్.. ఇంత పెద్దమొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడటం.. దేశంలోనే తొలిసారి. క్షమించాలి.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారట. దీంతో కొన్ని స్వచ్చంద సంస్థలు.. మా నాగరాజ్‌ను గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కించాలన్నారట. వాస్తవానికి నాగరాజు అక్రమాస్తులు.. రూ.150 కోట్లుగా తేలింది. బినామీ పేర్లతో మరో రూ.500 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. ఇక్కడ.. నాగరాజ్ దంపతుల గురించి చెప్పుకోవాలి. పోయిందేదో పోయింది.. మిగిలిందన్నా జాగ్రత్త పరచుకోవాలనే ఉద్దేశంతో నాగరాజ్ సతీమణి.. ఏసీబీ అధికారులకు చుక్కలు చూపిందనే చెప్పాలి. లాకర్ ఎక్కడుందంటే.. తెలియదంటారు. పోనీ… మీరెక్కడున్నారంటే.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని వెళ్లిపోయింది. అయినా.. పోలీసు యంత్రాంగం ఊరుకుంటుందా.. ఎలాగైతేనేం… ఓ బ్యాంకులో బినామీ నరేందర్ పేరిట లాకర్ ఉన్నట్టు గుర్తించారు. దాంట్లో ఏకంగా కిలోన్నర బంగారం.. అంటే సుమారు రూ.60లక్షల విలువైన ఆభరణాలు చూసి కంగుతిన్నారట. బాబోయ్.. అవినీతిలో అనకొండను మించాడనుకున్నారట. ఇప్పటికే అరెస్టయిన నలుగురు నిందితులు.. బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు 4వ తేదీన విచారణ జరుగనుంది.



